27 నుంచి సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం | - | Sakshi
Sakshi News home page

27 నుంచి సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం

Nov 23 2025 5:47 AM | Updated on Nov 23 2025 5:47 AM

27 నుంచి సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం

27 నుంచి సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వేదవ్యాస భారతంపై సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఈ నెల 27 నుంచి జనవరి 25వ తేదీ వరకూ 60 రోజుల పాటు రాజమహేంద్రవరంలో ప్రవచనాలు చేయనున్నారు. ఋషిపీఠం చారిటబుల్‌ ట్రస్ట్‌, ఋషిపీఠం సత్సంగం సంయుక్త ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరుగుతుందని భాగవత విరించి డాక్టర్‌ టీవీ నారాయణరావు తెలిపారు. స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మహాభారత ప్రవచన యజ్ఞం వివరాలు తెలియజేశారు. సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి రోజూ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకూ టి.నగర్‌ హిందూ సమాజంలో ప్రవచనాలు జరుగుతాయన్నారు. ప్రపంచ భాషల్లో 1.25 లక్షల శ్లోకాలు కలిగిన అత్యంత ఉత్కృష్ట గ్రంథం భారతం ఒక్కటేనని చెప్పారు. ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. సమకాలీన పరిస్థితుల్లో మనుషుల మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి, ఏది ధర్మమో, ఏది కాదో తెలుసుకోవడానికి భారతం చదవాలని చెప్పారు. ఇవేమీ కాకుండా మోక్షం కావాలనుకునే వారు సైతం భారతం చదవాలన్నారు. భారతంలోని సనత్సుజాతీయం అనేక వేద, ఉపనిషత్తుల సారాంశమని, విష్ణు, శివ సహస్ర నామాలు, భగవద్గీత మనలను తరింపజేసేవని అన్నారు. భారతంలోని అద్భుత సన్నివేశాలను క్రోడీకరించి, సమన్వయపరచి అందించే ప్రవచనకర్తల్లో సామవేదం వారిని ముందుగా చెప్పుకోవాలని నారాయణరావు అన్నారు. ఋషిపీఠం చారిటబుల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ, సామవేదం షణ్ముఖశర్మకు రాజమహేంద్రవరంతో ఎనలేని అనుబంధముందని చెప్పారు. ఇక్కడ ఆయన నెలకొల్పిన వల్లభ గణపతి ఆలయం నేడు ఒక దివ్యక్షేత్రంలా భక్తులను అలరిస్తోందన్నారు. గతంలో వ్యాస భాగవతం, వాల్మీకి రామాయణాలపై ప్రవచనాలు అందించిన సామవేదం.. త్వరలో చేయనున్న సంపూర్ణ వ్యాస భారత ప్రవచనాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రశేఖర్‌ కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement