కిక్కిరిసిన అన్నవరప్పాడు
పెరవలి: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం కిక్కిరిసిపోయింది. వేకువజాము నుంచే వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయ దేవేరులతో కొలువు తీరిన స్వామివారికి అర్చకులు విశేష పూజలు, వివిధ సేవలు నిర్వహించి, సుగంధభరిత పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దాత దోనెల వెంకటేశ్వరరావు దంపతుల ఆర్థిక సహాయంతో 8 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించినట్లు ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు.
జిల్లావ్యాప్తంగా సత్య సాయి
బాబా శత జయంతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా సచివాలయ స్థాయి వరకూ భక్తిప్రపత్తులతో నిర్వహించనున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణపై రెవెన్యూ, శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల, విద్యా శాఖ, సంగీత కళాశాల, సమాచార, పౌర సంబంధాల శాఖల అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె సమీక్షించారు. అనంతరం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాబా జయంతి సందర్భంగా ఆదివారం అన్ని కేంద్రాల్లోనూ తప్పనిసరిగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, సంబంధిత పొటోలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
రేపటి నుంచి ‘రైతన్నా మీకోసం’
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో సోమవారం నుంచి శనివారం వరకూ ‘రైతన్నా మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ అంశంపై తన క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య, అనుబంధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధిలో శాశ్వత మార్పు తీసుకురావడం లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి రైతులను కలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకూ విశ్లేషించి, డిసెంబర్ 3న 2026–27 కార్యాచరణ ప్రణాళిక ఖరారుకు ప్రతి రైతు సేవా కేంద్రంలో వర్క్‌షాపులు నిర్వహించాలని సూచించారు. ప్రతి 3 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా విభజించి, ఒక బృందం రోజుకు 30 క్లస్టర్లు (90 ఇళ్లు) సందర్శించాలని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశం, కరపత్రం అందజేయాలని కలెక్టర్ అన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్‌రెడ్డి, ఆర్‌డీఓలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత తదితరులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన అన్నవరప్పాడు


