రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు | - | Sakshi
Sakshi News home page

రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు

Nov 22 2025 7:36 AM | Updated on Nov 22 2025 7:36 AM

రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు

రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు

రాజమహేంద్రవరం రూరల్‌: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు అతివృష్టి, అనావృష్టితో నష్టపోతూ కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) అన్నారు. బొమ్మూరులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పంటల ధరలు పతనమై అన్నదాత కష్టాల్లో ఉంటే చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తూ పరిపాలనను, రైతులను పూర్తిగా గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. రైతుకు అండగా నిలిచేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలు, గొప్ప వ్యవస్థలు తీసుకొస్తే వాటిని చంద్రబాబు అటకెక్కించేశారన్నారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర టన్నుకు రూ.2,400 కాగా రూ.600 కూడా పలకడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటోందన్నారు. తీవ్ర వర్షాలు, మోంథా తుపాను ప్రభావంతో దిగుబడి, నాణ్యత గణనీయంగా తగ్గిపోయాయని, పంట నష్టం అంచనాల్లో చంద్రబాబు సర్కారు దారుణంగా కోత విధిస్తూండటంతో మరింత నష్టం వాటిల్లుతోందని చెప్పారు. పల్నాడు జిల్లాలో 54,145 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేస్తే చివరకు 3,912 ఎకరాలకు కుదించేశారని, రైతులు ఏం పాపం చేశారని ఇలా మోసం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి, గిట్టుబాటు ధర రాక పత్తి రైతుకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదన్నారు. కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా రంగు మారిందనే నెపంతో పంట కొనుగోలు చేయడం దారుణమన్నారు. రాయలసీమలో అరటి విస్తారంగా సాగు చేస్తున్నారని, టన్ను రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ అమ్మారని, ఇది కొన్ని రోజులుగా రూ.వెయ్యికి పడిపోయిందని న్నారు. రాష్ట్రంలో తొలిసారి పశువులకు దాణాగా అరటి వేయటం చూస్తున్నామన్నారు. తాము చెప్తే రాజకీయ ఆరోపణులంటారని, మరి టీడీపీ అధికారిక పత్రిక ఈనాడులో రాసింది కూడా అబద్ధమా అని ప్రశ్నించారు. అదే సాక్షి రాస్తే గగ్గోలు పెడతారన్నారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో లక్షలాది క్వింటాళ్ల శనగ నిల్వలు పేరుకుపోయాయన్నారు. వేరుశనగపై దిగుమతి సుంకం తగ్గించడంతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఉల్లి, మామిడి రైతులకు నష్ట పరిహారం వెంటనే చెల్లించాలన్నారు. చంద్రబాబు సర్కారు ఇప్పటికై నా కళ్లు తెరవాలని, రైతులకు అండగా నిలవాలని రామారావు డిమాండ్‌ చేశారు.

రైతుద్రోహిగా మిగిలిపోతారు

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పథకాన్ని 53 లక్షల మంది రైతులకు అమలు చేయాల్సి ఉండగా ఏడు లక్షల మంది రైతులను తగ్గించారని చెప్పారు. కిలో అరటిని రైతులు రూపాయికి అమ్ముకుంటున్నట్టు ఈనాడులోనే రాశారన్నారు. రైతును ఆదుకోకపోతే చంద్రబాబు రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం భారంగా మారిందని, మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో అప్పులు తీర్చే దారి లేక రైతులు పంట పొలాల్లోనే పురుగు మందులు తాగి అర్ధాతరంగా తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వందలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. ఇప్పటి వరకూ ఎవ్వరికీ పరిహారం అందించిన దాఖలాల్లేవన్నారు. ఉచిత పంటల బీమాను రైతులందరికీ వర్తింపజేయాలని, పంట నష్టపోయిన రైతులకు సీజన్‌ ముగిసేలోపే పరిహారం అందించాలని, తుపాను వల్ల నష్టపోయిన రైతులను, గిట్టుబాటు ధరలు లేని రైతులను వెంటనే ఆదుకోవాలని వేణు డిమాండ్‌ చేశారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకుందని గుర్తు చేశారు.

ఫ పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, అరటి పంటలకు కానరాని గిట్టుబాటు ధర

ఫ వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాబీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement