
ఆదినాయకా... అందుకో మా పూజ
అయినవిల్లి: ఆదినాయకా.. అందుకో మా పూజ అంటూ వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే వేడుకలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు ముస్తాబవుతున్నాయి.. ఇప్పటికే ఉత్సవ మంటపాల ఏర్పాటుకు అన్నీ ఏర్పాట్లూ చకచకా జరిగిపోతున్నాయి. ప్రసిద్ధి చెందిన అయినవిల్లి సిద్ధి వినాయకుని ఆలయం చవితి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా సిద్ధమైంది. బుధవారం వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు విఘ్నేశ్వరుని సన్నిధిలో వేడుకలు నిర్వహించనున్నారు. దీని కోసం ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. గతేడాది కంటే అధికంగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ వర్గాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. వివిధ రంగులతో ఆలయ గోపురాన్ని తీర్చిదిద్దారు. ప్రత్యేక పుష్పాలు, కొబ్బరి, అరటి ఆకులు, కూరగాయలు వంటి వాటితో ఆలయ ప్రాంగణంలో అలంకరిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అయినవిల్లి ఎప్సై హరికోటి శాస్త్రి చెప్పారు.
తొమ్మిది రోజులు.. ప్రత్యేక అభిషేకాలు
వినాయక చవితి సందర్భంగా బత్తాయి, దానిమ్మ, యాపిల్, ద్రాక్ష, మామిడి వంటి వివిధ సీజనల్ పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకాలు చేయనున్నారు. అనంతరం లక్ష గరిక పూజ, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ, హారతులు తదితర కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు ఉంటాయని ఏసీ వెంకట దుర్గాభవాని తెలిపారు. ఈ రోజుల్లో స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేస్తామన్నారు. చవితి రోజున సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయ ప్రాంగణం వెలుపల మండపంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజూ తెల్లవారు జామున నాలుగు గంటలకు ఆలయం తెరుస్తారు. మేలుకొలుపు సేవ తదితర పూజల ఆనంతరం ఐదు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు నిత్య గణపతి హోమం, ఒంటి గంటకు స్వామివారికి ప్రత్యేక అలంకరణ, ప్రసాద నివేదన కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం నాలుగు గంటలకు స్వామివారిని మూషిక వాహనంపై మాఢ వీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు పంచ హారతులు ఇస్తారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు తెలిపారు.
అన్ని ఏర్పాట్లూ చేశాం..
అయినవిల్లి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం. చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తాం. నవరాత్రుల్లో ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.
–అల్లు వెంకట దుర్గాభవాని,
ఆలయ ఈఓ, అయినవిల్లి
రేపటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు
ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన
ఆలయాలు, ఉత్సవ మంటపాలు
ఈ నెల 27 నుంచి
సెప్టెంబర్ 4 వరకూ వేడుకలు

ఆదినాయకా... అందుకో మా పూజ

ఆదినాయకా... అందుకో మా పూజ