
గొడవను అడ్డుకోబోతే గొంతు కోసేశాడు
రాజానగరం: ఇద్దరు వ్యక్తులు గొడవపడి, కొట్లాటకు దిగడంతో వారిని సముదాయించే ప్రయత్నం చేస్తూ, ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి ఉదంతమిది. రాజానగరం నడిబొడ్డున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ముత్యాలమ్మ గుడి వద్ద ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన గోళ్ల సాయి, అగత్తి సాయి అనే ఇద్దరు గొడవపడి, కొట్టుకున్నారు. గుడి వద్ద వినాయక చవితికి సంబంధించిన డెకరేషన్ పనులు చేస్తున్న నీలం లక్ష్మీప్రసాద్ దీనిని గమనించి, వారిద్దరినీ విడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గోళ్ల సాయి తన వద్ద ఉన్న చాకుతో అతని గొంతును కోశాడు. దీంతో రక్తపు మడుగులో పడిఉన్న లక్ష్మీప్రసాద్‌ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై ఎస్.ప్రియకుమార్ తెలిపారు.
మేల్ నర్సుపై సస్పెన్షన్ వేటు
కాకినాడ క్రైం: ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో కాకినాడ జీజీహెచ్‌లో పనిచేస్తున్న మేల్ నర్స్ మోకా సందీప్‌పై అధికారులు చర్యలు చేపట్టారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సందీప్‌పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సోమవారం సందీప్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. విధులకు మద్యం తాగి రావడం, బాధ్యతాయుతమైన నర్సు విధుల్లో పనిచేస్తూ ఓ మహిళ నగ్న ఫొటోలు ఆమెకు తెలియకుండా తీయడం, వాటిని అడ్డుపెట్టి బ్లాక్‌మెయిల్ చేయడం, బాధితురాలిని కొట్టి అఘాయిత్యానికి పాల్పడడం, ఆ ఫొటోలను ఆమె కుమారుడికి పంపడం తద్వారా ఆ బాలుడిని ఆత్మహత్యకు పురిగొల్పడం అంశాలు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరచడంతో అవే అంశాల ప్రాతిపదికన సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మద్యం తాగి విధులకు హాజరవుతున్నాడన్న సహ మేల్ నర్సుల ఫిర్యాదుతో అధికారులు విచారణకు సిద్ధమయ్యారు. ఎక్కువ రోజులు సెలవులో ఉంటున్న సందీప్‌కు అసలు అన్నాళ్లు సెలవు ఎవరు ఇస్తున్నారు, అలాగే సందీప్‌కు సహాయకారిగా ఉంటూ అతడి సెలవు దరఖాస్తులను అధికారులకు ఎవరు అందిస్తున్నారనే అంశాలపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.