
చెవిలో చెబితే.. కోర్కెలు తీర్చే స్వామి
బిక్కవోలు: చెవిలో చెబితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరొందిన బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం చవితి వేడుకలకు ముస్తాబైంది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆనుకుని ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. 1,100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడంతో చవితి ఉత్సవాలకు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ శ్రీలక్ష్మీగణపతి స్వామి ఏకశిలా మూర్తిగా దర్శనమిస్తారు. స్వామి విగ్రహం 10 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పున ఉంటుంది. స్వామివారికి తొండం కుడి వైపునకు తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు శాఖ అంచనా వేసింది. స్వామివారి చెవిలో తమ కోర్కెలు చెబితే తీరతాయనేది భక్తుల నమ్మకం. వినాయక చవితి సందర్భంగా గణపతి ఆలయంలో బుధవారం ఉదయం నుంచి గణపతి నవరాత్ర మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయం ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. మంగళవారం రాత్రి దాటాక బుధవారం తెల్లవారు జామున 1.58 గంటలకు తీర్థపు బిందె సేవతో స్వామివారి చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బుధవారం ఉదయం 11.04 కలశ స్థాపన చేశారు. ఈ వచ్చే నెల 6న మహాన్నదానంతో ఉత్సవాలు పూర్తవుతాయి.
గతేడాది కంటే ఘనంగా..
ఆలయం చుట్టుపక్కల అంతా రేకుల షెడ్డు ఏర్పాటు చేశాం. గత ఏడాది కంటే ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ క్యూలైన్లు నిర్మించాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి చవితి రోజు మినహా మిగిలిన రోజుల్లో అన్నదానం ఉంటుంది.
–ఎ.భాస్కర్, దేవదాయ శాఖ ఈఓ, బిక్కవోలు గ్రూప్ ఆలయాలు

చెవిలో చెబితే.. కోర్కెలు తీర్చే స్వామి

చెవిలో చెబితే.. కోర్కెలు తీర్చే స్వామి

చెవిలో చెబితే.. కోర్కెలు తీర్చే స్వామి