
వ్యసనాలకు అలవాటు పడి చోరీలు
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
నిడదవోలు: వ్యసనాలకు అలవాటు పడిన యువకులు చోరీల బాట పట్టారు. చివరకు పోలీసులకు చిక్కడంతో కటకటాల పాలయ్యారు. దీనికి సంబంధించి నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ కథనం ప్రకారం.. వివిధ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న నిడదవోలు పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన కోలా అభిషేక్ (నవీన్ కుమార్), అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన గుద్దటి రాజులను నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో సోమవారం సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు నిందితులు చిన్నతనం నుంచి చెడు వ్యసనాలకు బానిసై 2014 నుంచి మధురవాడ, వైజాగ్, పాడేరు, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవారు. మొదట తుని, కంచర్లపాలెం పోలీసులు జువైనల్ హోమ్‌కు పంపించారు. అనంతరం నిందితులు గణేష్, రఘు, రమణ, బాబు ద్వారా దొంగతనాలకు అలవాటు పడి మద్యానికి బానిసయ్యారు. ఇద్దరూ కలసి చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో చోరీలు చేసేవారు. తర్వాత వైన్ షాపుల తాళాలు బద్దలుకొట్టి లోపలకు చొరబడి డబ్బులు, మద్యం సీసాలు దొంగిలించేవారు. ఇవే కాకుండా ఆలయాల్లో రాత్రి సమయాల్లో తాళాలు బద్దలు కొట్టి డబ్బులు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించేవారు. వీరిపై వివిధ జిల్లాల్లో సుమారు 30 పైగా పాత కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో అరెస్టయి మళ్లీ బయటకు వచ్చి ఈ మధ్యకాలంలో 7 దొంగతనాలకు పాల్పడ్డారు. నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు. పెందుర్తిలో 2, పాడేరు, వి.మాడుగుల, మండపేట, రాజానగరంలలో ఒక్కొక్కటి చొప్పున చోరీ కేసులు వీరిపై ఉన్నాయి. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ చెప్పారు. ఈ కేసులను ఛేదించిన సీఐ తిలక్, సమిశ్రగూడెం రూరల్ ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు, పట్టణ ఎస్సై జగన్మోహనరావు, సిబ్బంది జి.రామారావు, జె.రెహ్మన్, జి.సాంబయ్య, ఎన్‌వీ రామాంజనేయులను కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ అభినందించారు.