
దివ్యాంగులను ఏడిపింఛెన్..!
● అనర్హత పేరుతో దివ్యాంగుల
పెన్షన్లకు భారీగా కోత
● వైకల్య ధ్రువీకరణ పత్రాలు
తీసుకురావాలని వెల్లడి
● అందుకు అనుగుణంగా
ఏర్పాటు చేయని సదరం క్యాంపులు
● తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా
33,688 మందికి పెన్షన్లు
● 19,928 మంది వైకల్య శాతం
తిరిగి పరిశీలన
● గగ్గోలు పెడుతున్న దివ్యాంగులు
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజలపైనే కాదు.. దివ్యాంగులపై కూడా కూటమి ప్రభుత్వానికి కనికరం కరువైంది. అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగిస్తోంది. ఉన్న ఆసరాను దూరం చేస్తోంది. కేవలం మంచానికే పరిమితమైనా.. అనర్హత కారణంగా చూపి వారి నోటికాడ కూడును లాగేస్తోంది. సరికొత్త నిబంధనలు తెరపైకి తీసుకొచ్చి పింఛన్లలో కొర్రీలు పెడుతోంది. మీ వైకల్య అర్హతను నిరూపించుకోవాలని మరి కొంతమందికి నోటీసులు అందిస్తోంది. రూ.15 వేలు పొందుతున్న పింఛను రూ.6 వేలకు తగ్గిస్తోంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారి పింఛన్లు మార్పుచేస్తూ తీరని వేదన మిగులుస్తోంది. కూటమి ప్రభుత్వ చర్యలతో దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. ఉన్న ఆర్థిక ఆసరాను లాగేస్తే తామెలా బతకాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అయినా ప్రభుత్వం కనికరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్లు భారీగా తగ్గించుకునేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
జిల్లాలో 3,211 పింఛన్లు తొలగింపు
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల మేరకు 33,688 మంది దివ్యాంగ కేటగిరిలో ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. వారిలో 1,321 మంది వివిధ రకాల హెల్త్ పింఛన్లు (రూ.15 వేలు) తీసుకుంటున్నారు. మిగిలిన 32,367 మంది రూ.6 వేల పింఛను పొందుతున్నారు. పింఛన్ల తొలగింపులో భాగంగా 19,928 మందికి సంబంధించిన వైకల్య శాతం తిరిగి పరిశీలించారు. వారిలో 3,211 మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు వైలక్య శాతం లేదని నిర్ధారించారు. వీరిని అనర్హులుగా గుర్తించి పింఛన్లు రద్దు చేసినట్లు ఆయా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటీసులు అందించారు.
పింఛను సొమ్ము తగ్గింపు
కూటమి ప్రభుత్వం ఆదాయ ఆర్జనలో భాగంగా పింఛను సొమ్మును సైతం తగ్గిస్తోంది. ఇందులో భాగంగానే రూ.15 వేలు పింఛను పొందుతున్న 398 మందిని వివిధ కారణాలతో దివ్యాంగ పింఛన్ల (రూ.6 వేల)కు మార్చింది. తొమ్మిది మందిని వృద్ధాప్య పింఛన్ల (రూ.4 వేలు)కు కుదించారు. రూ.6 వేలు దివ్యాంగ పింఛన్లు పొందుతున్న కోటాలో 18,609 మందికి రీ వెరిఫికేషన్ చేపట్టారు. 405 మందికి వృద్ధాప్య పింఛన్లుగా మార్చారు. 3,211 మందిని అనర్హులుగా గుర్తించి వారికి పింఛన్లు తీసేశారు.
తొలగిస్తున్నారిలా..
దివ్యాంగ పింఛనుకు మీరు అనర్హులంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నోటీసులు ఇస్తున్నారు. సదరం సర్టిఫికెట్ల జారీ 2009–2010లో ప్రారంభమైంది. ఆ సమయంలో 100 శాతం వికలత్వం ఉంటే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న రీ–వెరిఫికేషన్‌లో 40 శాతానికి తగ్గిపోతోంది. అదెలా తగ్గుతోందో అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. ఫలితంగా దివ్యాంగులు పింఛను కోల్పోతున్నారు. గతంలో వెరిఫై చేసి వైకల్య ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇచ్చింది వైద్యులే. అప్పుడు 85, 90, 100 శాతం వికలత్వం ఉంటే.. ఇప్పుడు 40 శాతం లోపు ఎలా తగ్గుతోందంటూ బాధితులు వాపోతున్నారు.
చాపకింద నీరులా తొలగింపు ప్రక్రియ
దివ్యాంగ పింఛన్ల తొలగింపు ప్రక్రియ చాపకింద నీరులా సాగుతోంది. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ శాతం మందికి పింఛనుకు అనర్హత ఉన్నట్లు తేలుతోంది. తమ పింఛను పోతుందని భావిస్తున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో కలెక్టరేట్, ఎంపీడీఓల వద్దకు పరుగులు తీస్తున్నారు. అనధికార సమాచారం మేరకు జిల్లాలో ఎనిమిది వేలకు పైగా పింఛన్లు తొలగించినట్లు తెలిసింది. ఈ నెల 27వ తేదీ వరకు సదరం రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. తొలగింపులకు గురైన వారిలో చెవిటి, మూగ, శారీరక వికలాంగులు, అంధులే అధికంగా ఉంటున్నారు.
తొలగింపులు కుట్రలో భాగమే..!
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కాలన్న తలంపుతో చంద్రబాబు సంక్షేమ పథకాలు, పింఛన్లపై అమలుకు సాధ్యంకాని ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చాక కోతలు ప్రారంభించారు. దివ్యాంగులపై కనీస కనికరం లేకుండా పింఛన్ల తొలగింపులకు నాంది పలికారు. ఇదంతా పింఛన్లు తగ్గించుకునేందుకు ఆడుతున్న నాటకంలో భాగమే అన్న ఆరోపణలున్నాయి.
సిఫారసులకే అందలం
దివ్యాంగుల పింఛన్ల తొలగింపులు, సదరం రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్ల జారీలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సిఫారుసులకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్న వారికే ఇస్తున్నారు. వైకల్యం లేకపోయినా.. ఉన్నట్లు ధ్రువీకరిస్తూ పింఛన్లు కొనసాగిస్తున్నారు. సిఫారసు లేనివారికి మాత్రం నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. సిఫారసులు ఉన్న వారికి రూ.15 వేల పింఛన్లు వచ్చే విధంగా 85 నుంచి 100 శాతం వరకు వికలత్వం నమోదు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలిన వారికి మాత్రం తొలగించేస్తున్నారు. మరి కొంత మంది సదరం క్యాంపులో మామూళ్లు ముట్టజెప్పి వైకల్య శాతం నమోదు చేయించుకుంటున్నారు. పైసలు ఇవ్వలేని వాళ్లు మాత్రం ఏమీ చేయలేక వెనుదిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
చిత్రంలో మంచానికే పరిమితమైన వ్యక్తి పేరు పేకేటి సత్యనారాయణ. నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం గ్రామంలో నివాసముంటున్నారు. ఈయన పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నారు. ఏ పనీ చేసుకోలేని పరిస్థితి. కేవలం మంచానికే పరిమితమయ్యారు. భార్య సహాయం చేస్తే తప్ప తనపని తాను చేసుకోలేని దుస్థితి. అలాంటి వ్యక్తిపై సైతం కూటమి ప్రభుత్వం కనికరం చూపడం లేదు. 85 శాతం వైకల్యం ఉండాలని.. రీ వెరిఫికేషన్‌లో 59 శాతం వైకల్యం మాత్రమే ఉందని నోటీసు ఇచ్చారు. అనర్హత పేరుతో పింఛను పీకేశారు. కళ్లముందు వ్యక్తి మంచంపై ఉంటే.. వైకల్యం లేదనడం ఎంతవరకూ సమంజసం. దీంతో ఆ దివ్యాంగుడు లబోదిబో మంటున్నారు. తాను, భార్య ఉంటున్నామని, తన కుటుంబానికి ఆసరాగా ఉన్న పింఛన్ తొలిగిస్తే కుటుంబ పోషణ ఎలాగంటూ ఆవేదన చెందుతున్నారు. కేవలం ఇతనొక్కరే కాదు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగుల పరిస్థితి ఇలాగే ఉంది.

దివ్యాంగులను ఏడిపింఛెన్..!

దివ్యాంగులను ఏడిపింఛెన్..!