
సెంట్రల్ జైలులో ఆక్టోపస్ మాక్ డ్రిల్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర కారాగారంలో ఆపరేషన్ మహా సురక్ష పేరుతో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆ వివరాలను జైలు సూపరిడెంట్ ఎస్.రాహుల్ బుధవారం తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో రెవెన్యూ, ఫైర్, మెడికల్, ఎలక్ట్రికల్ విభాగాల సిబ్బంది, లోకల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్‌లు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. జైలులో అత్యవసర పరిస్థితులు ఎదురై, అనుకోని ఘటనలు జరిగినప్పుడు, ఉగ్రవాద చర్యలు, ప్రమాదకర ఘటనలు ఎదురైనప్పుడు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం మాక్ డ్రిల్ ముఖ్యోద్దేశం. రక్షణ వ్యవస్థలను సమర్థంగా వినియోగించి ప్రతిస్పందించడమే ధ్యేయంగా దీన్ని నిర్వహించారు. అత్యవసర పరిస్థితులలో సురక్షిత చర్యలు చేపట్టడానికి అవసరమైన మార్గదర్శకాలను జైలు అధికారులకు, సిబ్బందికి ఆక్టోపస్ బృందం వివరించింది. మాక్ డ్రిల్‌లో ఆక్టోపస్ అధికారులు, డీఎస్పీలు బి.కృష్ణ, కె.శంకరయ్య, ఇన్‌స్పెక్టర్ బి.మురళీ, ఆక్టోపస్ సిబ్బంది, జైలర్లు, డిప్యూటీ జైలరు పాల్గొన్నారు.