
లంకలను ముంచెత్తిన వరద
● 198 మంది పునరావాస
కేంద్రాలకు తరలింపు
● జలదిగ్బంధంలో కేతావారి లంక,
వెదుర్లంక, బ్రిడ్జి లంక
● సహాయక చర్యలను
పర్యవేక్షిస్తున్న ఆర్డీఓ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): లంక ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తారు. వర్షాకాలం మూడు నెలలు వీరికి కష్టకాలం అని చెప్పవచ్చు. చేపలు పట్టుకోవడం, లంకల్లో పశువుల పెంపకం వంటి పనులతో వీరంతా జీవనోపాధి పొందుతారు. వర్షాకాలంలో గోదావరికి వరద నీరు చేరడంతో వీరిని పునరావాస కేంద్రాలకు తరలించడం పరిపాటుగా మారింది. ఏటా వర్షాకాలంలో వీరిని రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అక్కడే వీరికి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వరద ఉధృతి తగ్గిన తరువాత వారంతా తిరిగి లంకల్లోకి వెళ్లతారు.
మగవారు పడవలకి కాపలా...
మహిళలు, పిల్లలు, వృద్ధులు పునరావాస కేంద్రాలకు తరలిరాగా మగవారు మాత్రం పడవలకు కాపలాగా లంకల్లోనే ఉంటారు. పడవలు వరద ఉధృతిలో కొట్టుకుపోకుండా వాటిని కాపాడుతారు. కొంతమంది మగవాళ్లు పునరావస కేంద్రానికి వచ్చి భోజనం చేసి తిరిగి లంకల్లోకి చేరుకుంటారు. అప్పుడు మిగిలిన వాళ్లు పునరావాస కేంద్రానికి వచ్చి భోజనాలు చేస్తారు.
పునరావాస కేంద్రానికి తరలింపు
గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ముందుస్తు చర్యలుగా నదీ పరివాహక ప్రాంతంలోని మూడు లంకల్లో ఉన్న కుటుంబాలకు చెందిన వారిని అధికారులు సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు. మంగళవారం మత్స్య, అగ్నిమాపక, రెవెన్యూ, మునిసిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో మూడు లంక గ్రామాల్లోని కుటుంబాలను తరలించారు. మానవ, పశువుల ప్రాణ నష్టం నివారణ చర్యల్లో భాగంగా వారిని సురక్షితంగా పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. ఆల్కట్ గార్డెన్, మునిసిపల్ కల్యాణ మండపంలో వీరికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. బ్రిడ్జి లంక, ఎదుర్లమ్మలంక, కేతవారిలంక కు చెందిన సుమారు ఇప్పటి వరకు 198 మందికి పునరావాస కేంద్రంలో చేర్చారు.