రాజమహేంద్రవరం సిటీ: మానసిక వికలాంగత్వం (ఎమ్.ఆర్), మానసిక అనారోగ్యం (ఎమ్.ఐ) కేటగిరీల కింద తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేసిన వారికి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు నిలుపుదల కావని, ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయబోమని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ జిల్లాలో 4,328 మంది ఈ రెండు కేటగిరీల కింద పెన్షన్లు పొందుతున్నారన్నారు.
వారిలో 1,402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో 477 మందికి నోటీసులు జారీ చేశారన్నారు. ఎమ్‌ఆర్ కేటగిరీలో 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 256 మందికి తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేశామన్నారు. ఎమ్‌ఐ కేటగిరీలో 1,157 మందిలో 429 మందికి పరీక్షలు జరగగా, అందులో పెన్షన్ నిలిపివేసిన 206 మందిలో 204 మంది 18 ఏళ్ల లోపు వారే ఉన్నారన్నారు. వారికి తాత్కాలిక ధ్రువపత్రం జారీ చేశామని వివరించారు.
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రాజమహేంద్రవరం రూరల్: పదవ తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్ ఫెయిలైన అభ్యర్థులకు జిల్లాలో గల ప్రభుత్వ ఐటీఐలలో 2025–26 సంవత్సరానికి మూడవ విడత అడ్మిషన్స్‌కు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ సీహెచ్ సునీల్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో ఐటిఐ.ఏపీ.జివోవి.ఐన్ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఐటీఐలో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జత జిరాక్స్ కాపీలతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలకు 79813 08986, 78010 95303 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.
రేపు సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం
అన్నవరం: శ్రావణమాసం ఐదో శుక్రవారం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన ‘సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం’ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు ఈ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కల్యాణ మండపంతోపాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలలో కూడా ఈ వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మూడు మండపాలలో వ్రతాలు నిర్వహించిన తరువాత కూడా మహిళలు ఎక్కువగా ఉంటే ఉదయం పది గంటలకు రెండో బ్యాచ్‌లో కూడా ఈ వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.