
ఆర్టీసీ బస్సు వద్ద మహిళల తోపులాట
అనపర్తి : ప్రచార ఆర్భాటంతో అరకొర బస్సులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన సీ్త్ర శక్తి (సీ్త్రలకు ఉచిత బస్సు) పథకం ప్రారంభించి నాలుగు రోజులు గడవకుండానే మహిళల సహనానికి పరీక్షగా నిలిచింది. మంగళవారం అనపర్తి బస్టాండ్‌లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే సాయంత్రం నాలుగు గంటల సమయంలో కళాశాలల నుంచి, వ్యాపార, షాపింగ్ తదితర పనులు ముగించుకుని వారి గమ్యస్థానాలకు బయలుదేరిన మహిళలు పెద్ద ఎత్తున అనపర్తి బస్టాండ్‌లో వేచి ఉన్నారు. ఇంతలో ఒక బస్సు వచ్చి బస్టాండ్‌లో నిలిచింది. దీంతో మహిళలంతా ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ నెట్టుకుంటూ బస్సు ఎక్కడానికి చేసిన ప్రయత్నం రణరంగాన్ని తలపించింది. జనం ఎక్కువగా ఉండడంతో ముందుగా బస్సు ఎక్కాలన్న ఆతృతలో బస్సు ఆగకుండానే ఎక్కడానికి ప్రయత్నించిన ఒక మహిళ జారి పడి బస్సు కిందదికి వెళ్లిపోవడంతో ప్రయాణికులు అప్రమత్తమై పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే సీ్త్ర శక్తి పథకాన్నైతే ఆడంబరంగా ప్రకటించారు కాని అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ సమయంలో చక్కగా ప్రయాణాలు సాగేవని ఈ పథకం ప్రవేశపెట్టాక సమయానికి బస్సులు రాక, పనులు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనపర్తిలో యుద్ధ వాతావరణాన్ని
తలపించిన ఉచిత బస్సు ప్రయాణం