
కౌలుకునేదెలా..?
సాక్షి, రాజమహేంద్రవరం: కౌలు రైతులపై కూటమి ప్రభుత్వ కనికరం కరవైంది. సీసీఆర్‌సీ కార్డుల జారీ నుంచి, పంట రుణాలు అందించడంలో తీరని అన్యాయం జరుగుతోంది. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం, ఆపై కూటమి సర్కారు పట్టించుకోకపోవడంతో పంట సాగుకు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్నదాత సుఖీభవ సాయం కూడా సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారు. వెరసి పంట సాగుకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన దుస్థితి ఎదురైందని ఆవేదన చెందుతున్నారు. ఇంత చేసినా చివరకు పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేసి దిగుబడులు తగ్గడం, మద్దతు ధర దక్కకపోవడంతో ఆశించిన మేర రాబడీ అందడం లేదు. వెరసి కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
రుణాలపై బ్యాంకర్ల విముఖత
కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు విముఖత చూపుతున్నారు. కొన్ని బ్యాంకులైతే తాము ఇవ్వలేమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఇందుకు పలు కారణాలను స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కౌలుదారు సాగు చేస్తున్న భూములపై అసలైన యజమానులు రుణాలు తీసుకోవడంతో, ఒకే భూమిపై యజమానికి, అటు కౌలు రైతుకు రుణాలివ్వడం అసాధ్యమన్న వాదన బ్యాంకర్ల నుంచి వినిపిస్తోంది. భూ యజమానులు రుణాలు తిరిగి చెల్లిస్తే.. వాటి స్థానంలో కౌలు రైతులకు మంజూరు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని అంటున్నారు. వెరసి జిల్లాలో కౌలు రైతుల రుణాల లక్ష్యం ముందుకు కదలడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు ప్రారంభమైంది. నాట్ల ప్రక్రియ సింహభాగం పూర్తయింది. పంట సాగుకు పెట్టుబడుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఆర్థిక ఆసరా అవసరం. రుణాలు మంజూరు చేస్తే పంట సాగుకు భరోసా ఉంటుంది. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కానరావడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో తీవ్ర వైఫల్యం చెందిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లక్ష్యం రూ.307 కోట్లు
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1,11,000 కౌలు రైతులకు కార్డులు అందజేసి, రూ.307 కోట్ల పంట రుణాలు లక్ష్యంగా నిర్దేశించారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం గడప దాటడం లేదు. ఇప్పటి వరకు కేవలం రూ.13 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న లక్ష్యం కోసం కుస్తీ పడుతున్నారు. ఒక్క పెరవలి మండలం మినహా, మిగిలిన మండలాల్లో రూ.కోటి రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవంటే పరిస్థితి ఏమిటో అవగతమవుతోంది. ఇలాగైతే తాము సాగు ఎలా చేయాలన్న ప్రశ్న రైతుల నుంచి ఉత్పన్నమవుతోంది.
సగం కార్డులే జారీ..!
కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డుల జారీలో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల మంది కౌలు రైతులున్నట్టు సమాచారం. ఏటా వీరు భూములు కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నారు. భూమి యజమాని సమ్మతితోనే సీసీఆర్‌సీ కార్డులు జారీ చేస్తారు. 2025–26లో జిల్లావ్యాప్తంగా 1,11,000 మంది కౌలు రైతులకు కార్డులు మంజూరు చేయాలని వ్యవసాయ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు కేవలం 57,328 మందికి మాత్రమే కార్డులు జారీ చేయగలిగారు. 52.12 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. మిగిలిన లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉంది. నల్లజర్ల, రంగంపేట, రాజానగరం మండలాల్లో లక్ష్యం 30 శాతానికి మించలేదు. సీసీఆర్‌సీ కార్డు జారీ కావాలంటే రూ.10 స్టాంపుపై రాసుకున్న అగ్రిమెంట్‌పై భూ యజమాని, కౌలుదారు ఇద్దరూ సంతకాలు చేయాలి. వీఆర్‌ఓలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియలో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. వీఆర్వోలు నాన్చివేత ధోరణి అవలంబిస్తుండటంతో రైతులకు సకాలంలో రుణాలందడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందర వీఆర్వోలు రూ.వెయ్యి వరకు దండుకుంటున్నట్టు తెలిసింది.
అందని ‘అన్నదాత సుఖీభవ’
కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘అన్నదాత సుఖీభవ’ నిధులు కౌలు రైతులకు అందిన దాఖలాలు లేవు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా 57,328 మందికి సీసీఆర్‌సీ కార్డులు మంజూరయ్యాయి. ఇందులో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.7 వేల సుఖీభవ నిధులు సగం మందికి పైగా జమ అయిన దాఖలాలు లేవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తడిసిమోపెడవుతున్న కౌలు
కౌలు రైతులకు కౌలు సొమ్ము తడిసిమోపెడవుతోంది. యజమానులు ప్రతి ఏటా కౌలు పెంచుకుంటూ పోతున్నారు. ఎకరానికి 45 బస్తాల ధాన్యం పండితే.. అందులో భూ యజమానికి 30 బస్తాల ధాన్యం ఇవ్వాల్సి ఉంటోంది. మిగిలింది కౌలు రైతులకు వెళుతోంది. వాటిలోనే సాగు ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఈ పరిణామం ఇబ్బందికరంగా మారుతోంది.
గత ప్రభుత్వ హయాంలో..
కాగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రూ.12,500 అందజేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కిసాన్‌తో కలిపి రూ.13,500 అందజేశారు. కేవలం రైతులకే కాకుండా కౌలు రైతులకూ అందించింది. దీర్ఘకాలంగా దేవస్థానం భూములు కౌలుకు తీసుకున్న రైతులకూ లబ్ధి చేకూరింది. జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలోని నాలుగేళ్లలో 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేశారు.
కౌలు రైతుపై కూటమి సర్కార్ దా’రుణం’
పూర్తి స్థాయిలో అందని పంట రుణాలు
జిల్లావ్యాప్తంగా రూ.307 కోట్ల లక్ష్యం
ఇప్పటి వరకు ఇచ్చింది
కేవలం రూ.13 కోట్లే..
రుణాలు ఇచ్చేందుకు
ముందుకు రాని బ్యాంకర్లు
‘అన్నదాత సుఖీభవ’ నిధులు సైతం
అందని వైనం
సీసీఆర్‌సీ కార్డుల జారీలోనూ నిర్లక్ష్యం
జిల్లాలో పంట రుణాలిలా..
మండలం రుణ లక్ష్యం మంజూరు
(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
రాజమండ్రి 4.75 0.70
రాజానగరం 27.50 0.64
కడియం 11.90 0.25
కోరుకొండ 27.90 0.57
సీతానగరం 16.75 0.71
గోకవరం 16.90 0.62
అనపర్తి 17.10 0.81
బిక్కవోలు 18.50 0.80
రంగంపేట 16.90 0.69
కొవ్వూరు 16.75 0.67
చాగల్లు 16.40 0.88
దేవరపల్లి 17.60 0.87
గోపాలపురం 15.10 0.96
తాళ్లపూడి 12.45 0.97
నిడదవోలు 18.70 0.74
ఉండ్రాజవరం 16.40 0.87
పెరవలి 17.10 1.03
నల్లజర్ల 18.80 0.74
కౌలు రైతుల గుర్తింపులో విఫలం
కౌలు రైతుల గుర్తింపు, కార్డుల జారీ, రుణాల మంజూరులో కూటమి ప్రభుత్వం విఫలమైంది. కౌలు రైతులను గుర్తించడంపై దృష్టి పెట్టడం లేదు. ఇందుకు గ్రామసభల ఏర్పాటు కలగానే మారింది. కౌలు రైతులకు రుణాలు ఇప్పించడం లేదు. భూమి లేకుండా, కౌలుకు భూమి తీసుకుని సాగు చేసుకుంటున్న ప్రతి రైతుకూ కౌలు కార్డులో పాటు, అన్నదాత సుఖీభవ, పంట రుణాలు మంజూరు చేయాలి.
– కె.శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏపీ రైతు సంఘం
రుణాల ముంజూరుకు కృషి
కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ప్రతి వారం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి, రుణాల మంజూరుపై నెలకొన్న ఇబ్బందులపై చర్చిస్తున్నాం. అర్హులైన ప్రతి కౌలు రైతుకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరుతున్నాం. సీసీఆర్‌సీ కార్డులు సైతం అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటాం.
– ఎస్.మాధవరావ్, జిల్లా వ్యవసాయ అధికారి

కౌలుకునేదెలా..?

కౌలుకునేదెలా..?