
పులసా.. గోదారంటే అలుసా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘గోదాట్లో నీరు ఎరుపెక్కిందంటే నా సామిరంగా.. సముద్రం నుంచి పులస లగెత్తుకు రావాల్సిందే. వెంటనే పుస్తెలు అమ్మయినా పులస పులుసు తినాల్సిందే’ అంటుంటారు గోదావరి జిల్లాల వాసులు. ఏడాదికి ఒకసారి మాత్రమే అదికూడా గోదావరికి వరద నీరు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే పులసలు ఈసారి మొహం చాటేస్తున్నాయి. గోదావరికి వరదలు వచ్చి ఎర్రనీరు పోటెత్తుతున్నా పులస జాడ లేదు. గత సీజన్లతో పోలిస్తే పులసలు ఎప్పుడూ ఈ స్థాయిలో తగ్గిపోలేదని ఇక్కడ మత్స్యకారులు మదనపడుతున్నారు. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచే పులసలు గోదావరిలో సందడి చేస్తాయి. ఆగస్టు మూడోవారం వచ్చేసినా వాటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఈ నెలాఖరుకై నా రాకుండా పోతాయా అని గోదావరి జిల్లాల జనం ఎదురు చూస్తున్నారు.
ముచ్చటగా మూడు
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ముచ్చటగా మూడంటే మూడు పులసలు మాత్రమే మత్స్యకారులకు దొరికాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం పరిసర ప్రాంతాల్లో 20 రోజుల వ్యవధిలో మత్స్యకారుల వలలకు చిక్కాయి. కిలో పులస రూ.20 వేల నుంచి రూ.26 వేల వరకూ.. అది కూడా వేలంలో సొంతం చేసుకుంటున్నారు. కొందరైతే మత్స్యకారులకు రూ.5 వేలు, రూ.10 వేల చొప్పున చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేజీ నుంచి మూడున్నర కేజీలు, కొన్ని 4, 5 కేజీలున్న పులసలు కూడా మత్స్యకారుల వలకు చిక్కేవి. నాలుగైదు కేజీలున్న పులసలు ఐదారు వలలో పడ్డాయంటే వారి పంట పండినట్టే. నాలుగైదు కేజీల పులస రూ.10 వేల నుంచి రూ.15 వేలు పలికేది. గోదావరి తీరంలో ఒకప్పుడు యానాం, భైరవపాలెం, కోటిపల్లి, ఎదుర్లంక, రావులపాలెం, సిద్ధాంతం తదితర ప్రాంతాల్లో పులసలు విరివిగా లభించేవి. మత్స్యకారులు అర్ధరాత్రి నుంచి తెల్లారే వరకూ ఈ ప్రాంతాల్లోనే వేటాడేవారు. అటువంటిది ఇక్కడ కూడా పులసలు దొరక్క వారు నిరాశతో ఇళ్లకు తిరిగొచ్చేస్తున్నారు. గతంలో వరదల సీజన్ మొదలయ్యాక ప్రతి నెలా 40 టన్నులకు తక్కువ కాకుండా పులసలు పడేవన్నది మత్స్య శాఖ అంచనా. ప్రస్తుతం ఇందులో 10 శాతం కూడా ఈసారి కనిపించడం లేదని అంటున్నారు.
చమురు సంస్థల
కార్యకలాపాలతో..
పులసలు పునరుత్పత్తి కోసం బంగాళాఖాతంలో 11 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తాయి. సాగర సంగమం వద్ద ఉండే మొగల నుంచి గోదావరి నదిలోకి ఇవి ప్రవేశిస్తాయి. సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి వచ్చే ఇలస (హిల్స–విలస) చేప ఏటికి ఎదురీదుతూ గోదావరిలోకి వచ్చేసరికి పులసగా రూపాంతరం చెందుతుంది. అయితే.. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్‌లోని ఆఫ్‌షోర్‌లో జరుగుతున్న డ్రెడ్జింగ్‌తో ధ్వని కాలుష్యం పెరిగిపోయింది. గోదావరి నదీ ముఖద్వారం (సీ మౌత్) వద్ద రిలయన్స్, ఓఎన్‌జీసీ తదితర చమురు సంస్థలు నిర్వహిస్తున్న డ్రెడ్జింగ్ పనులు పులసల రాకకు ప్రతిబంధకంగా మారాయి. డ్రెడ్జింగ్ వల్ల నీటిలో సంభవించే కంపనాలు, శబ్దాల వల్ల పులసలు గోదావరి నదిలోకి రావడం లేదు. ఏపీ తీరం వైపు రావాల్సిన పులసలు ఒడిశా, బెంగాల్ వైపు వెళ్లిపోతున్నాయి. యానాం సమీపాన గాడిమొగ, భైరవపాలెంతో పాటు అంతర్వేది, కరవాక సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాలు గోదావరి నదిలో కలుస్తున్నాయి. ప్రధానంగా సల్ఫర్, అమ్మోనియా, లెడ్, పాదరసం ఇతర కర్బనాలు నదిలో కలుస్తున్నాయి. ఆక్వా సాగులో వినియోగించే యాంటీబయోటిక్స్, పటిక (ఆలం) వంటివి కలుస్తూండటంతో పులస గోదావరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
ఈ వైపు కన్నెత్తి చూడని జలపుష్పం
ఒడిశా, బెంగాల్ వైపు పయనం
జిహ్వ జివ్వున లాగేస్తున్నా కానరాని ఆచూకీ
మూసుకుపోయిన సముద్ర మొగలు
కేజీ బేసిన్‌లో చమురు కార్యకలాపాలు..
ప్రాణభయమూ మరో కారణం
ఒకప్పుడు నాలుగున్నర కేజీలుండే పులస
ఇప్పుడు కిలో దొరకడమే గగనం

పులసా.. గోదారంటే అలుసా!

పులసా.. గోదారంటే అలుసా!

పులసా.. గోదారంటే అలుసా!