
వేదవిహిత జీవనమే గుళ్లపల్లి గమ్యం
● సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ
● సీతారామచంద్ర ఘనపాఠికి
రాజా–లక్ష్మి ఫౌండేషన్ అవార్డు
రాజమహేంద్రవరం రూరల్: వేద పండితులు ఎందరో ఉన్నారు, కానీ వేదవిహిత జీవనమే జీవనయానంగా చేసుకున్న వారిలో గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి ప్రముఖులు అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం శివారులోని కొంతమూరులో ఉన్న దత్తాత్రేయ వేద విద్యాలయం గురుకులం ప్రాంగణంలో గురుకులం గౌరవాధ్యక్షుడు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠికి రాజా–లక్ష్మి ఫౌండేషన్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ, తాను వేద ధర్మాలను ఆచరిస్తూ, ఎందరో వేద పండితులను గురుకులం ద్వారా తయారు చేస్తున్న గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠికి ఈ అవార్డు రావడం ముదావహమన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, సంప్రదాయంలో పెద్దలను బ్రహ్మశ్రీ, వేదమూర్తులు అని సంబోధించడం పరిపాటి అని, మూర్తీభవించిన వేదమూర్తులు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి అని కొనియాడారు. అత్యంత సంప్రదాయబద్ధంగా గురుకులాన్ని నిర్వహిస్తూ, వేదమాతకు ఎనలేని సేవలను అందిస్తున్నారని అభినందించారు. ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకట్రావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు పురస్కారాలను చెన్నయ్‌లోనే అందజేశామని, గుళ్లపల్లి అనుష్ఠాన విధులకు భంగం కలగరాదనే ఉద్దేశంతో ఈ ఏడాది రాజమహేంద్రవరంలో అవార్డు ప్రదానం చేస్తున్నామన్నారు. మహాపోధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, సామవేదం షణ్ముఖశర్మ తదితర ప్రముఖుల చేతులమీదుగా రూ.లక్ష నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో గుళ్లపల్లికి అవార్డును అందజేశారు.