ధాన్యం కొనుగోలు చేయాలి
‘అన్నదాతల ఆగ్రహం’పై స్పందించిన మంత్రి
పెరవలి: ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు చేసిన ఆందోళనకు నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. అధికారులతో గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. పెరవలి మండలం కానూరు అగ్రహారం, పిట్టల వేమవరం, కాపవరం గ్రామాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బంది రంగంలోకి దిగి, శుక్రవారం రైతుల ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల్లో (ఆర్‌ఎస్‌కే) నమోదు చేసి, పర్మిట్లు తీసుకున్నారు. వాటిని రైతులకు అందించారు. పెరవలి మండలంలో 70 శాతం వరికోతలు జరిగినా ధాన్యం మాత్రం రైతుల వద్దే ఉన్నది. మిల్లులకు తీసుకువెళ్లినా.. టార్గెట్ పూర్తయ్యిందంటూ ధాన్యం తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరించడంతో మండిపడిన రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించి, గురువారం రాస్తారోకో చేసిన విషయం తెలిసిందే. రైతుల సమస్యను, వారి ఆందోళనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ‘సాక్షి’కి, వెంటనే స్పందించిన మంత్రికి స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన గ్రామాల్లో కూడా ధాన్యం కొనుగోలుకు అనుమతులివ్వాలని కోరుతున్నారు.
దంపతుల వివాదం..
భార్య ఆత్మహత్య
దేవరపల్లి: మేనల్లుడి పుట్టిన రోజు సందర్భంగా దంపతుల మధ్య ఏర్పడిన వివాదం భార్య ఆత్మహత్యకు దారి తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం గొల్లగూడేనికి చెందిన నూతంగి రామకృష్ణకు, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన సుశీల(30)కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడున్నాడు. మండలంలోని బందపురంలో రామకృష్ణ మేనల్లుడి పుట్టిన రోజు వేడుకలు గురువారం రాత్రి నిర్వహించారు. ఈ వేడుకలకు వెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం ఏర్పడింది. అనంతరం, తన కుమారుడిని తీసుకుని మేనల్లుడి పుట్టిన రోజు వేడుకలకు రామకృష్ణ వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో రామకృష్ణ బందపురం నుంచి ఇంటికి రాగా గదిలో భార్య సుశీల ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నట్లు గుర్తించాడు. సుశీల మృతదేహాన్ని పోస్టుమార్టానికి గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేయాలి


