రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలి
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు డిమాండ్
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
కొవ్వూరు: రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, తలారి వెంకట్రావు డిమాండ్ చేశారు. ధాన్యం విక్రయించుకోవడంలో రైతులు ఎదుర్కొంటున్న అవస్థలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఈ– క్రాప్ ద్వారా ఎన్ని ఎకరాలు నమోదు చేస్తే అన్ని ఎకరాల్లో పండిన ధాన్యం అంతా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ–క్రాప్ చేసిన ధాన్యం అంతా కొనుగోలు చేసిందని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇంత వరకు కేవలం నలభై శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారన్నారు.
రైతులకు తీవ్ర నష్టం
ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకి ధాన్యాన్ని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. రూ.1,725 బస్తాను రైతు రూ.1,250 అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ లెక్కన రైతు ఎకరాకి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు నష్టపోవాల్సి వస్తుందన్నారు. గతంలో సీజన్ ఆరంభానికి నెల రోజులు ముందే రైతు భరోసా పథకం కింద వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రూ.13,500 అందజేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.20వేలు ఇస్తానని రైతులను నమ్మించి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. కోకో పంటకు మద్దతు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
అనంతరం ఆర్డీవో రాణి సుస్మితకు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి పట్టాభి రామారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమణి రమేష్‌బాబు, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు తోట రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు చెల్లింకుల దుర్గామల్లేశ్వరరావు, సుంకర సత్యనారాయణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గండ్రోతు సురేంద్రకుమార్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలి


