బరితెగించారు!
● జిల్లా వ్యాప్తంగా కోడి పందేలకు ఏర్పాట్లు
● రాజకీయ నేతల కనుసన్నల్లోనే నిర్వహణ
● కత్తులపై నిషేధం ఉన్నా
నిర్వాహకుల బేఖాతరు
● టీడీపీ ప్రజా ప్రతినిధుల నేతృత్వంలో బరులకు పాటలు
● పోలీసుల కళ్లముందే చకచకా కసరత్తు
సాక్షి, రాజమహేంద్రవరం: పందెం కోడి కాలుదువ్వుతోంది.. సంక్రాంతికి ఢీ అంటే ఢీ అంటోంది. జిల్లా వ్యాప్తంగా కోడి పందేల నిర్వహణకు బరులు సిద్ధమవుతున్నాయి. స్వయంగా రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఈ పందేలు జరగనుండడం విశేషం. ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, కూటమి నేతల ఆశీర్వాదం ఉన్న వారికే బరులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ఎవరు ఎక్కడ పందేలు నిర్వహించాలన్నది ఇప్పటికే ప్రజా ప్రతినిధులు, పోలీసులు కలిసి నిర్ధారించినట్టు సమాచారం. ఒక్కో బరికి రూ.లక్షల్లో చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. వీటికి అనుబంధంగా జూదాలు సైతం నిర్వహిస్తున్నారు. యాంకర్లను ఏర్పాటు చేసి మరీ ఖరీదైన బహుమతులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బరులకు ముమ్మర ఏర్పాట్లు
జిల్లాలోని కొవ్వూరు, పెరవలి, చాగల్లు, నిడదవోలు, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, గోపాలపురం తదితర మండలాల పరిధిలో కోడిపందేల బరులకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించి తమ బరుల్లో పందేల నిర్వహణకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. తమ బరుల్లోనే ఎక్కువ పందేలు జరిగేలా అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా బరుల్లో మద్యం, బిర్యానీ, కూల్‌డ్రింక్స్, టిఫిన్ స్టాళ్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారు. గుండాట, పేకాట వంటి జూదాలు యథేచ్ఛగా సాగనున్నాయి. చిన్నబరి, పెద్దబరి, ముసుగు పందేలకు సన్నద్ధమవుతున్నారు. పార్కింగ్‌లు, పందేల నిర్వహణకు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు.
టీడీపీ, జనసేన నేతృత్వంలో!
కోడిపందేల బరులు సింహభాగం ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల అండదండలతో ఏర్పాటవుతున్నాయి. ఏ గ్రామంలో ఎవరి బరి నిర్వహించాలి? పేకాట, గుండాట ఎవరు పెట్టుకోవాలి? ఇలా కోడిపందేలు, జూడక్రీడలకు కూటమి నేతలు వేలం పాట నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాటల్లో ఒక్కో బరి రూ.లక్షల్లో పలుకుతోంది. ఆ సొమ్మును ఎవరు ఎంత పంచుకోవాలో ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. రూ.20 లక్షల బరిలో ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు, పోలీసులకు రూ.3 లక్షలు, మిగిలిన సొమ్మును స్థానిక కూటమి నేతలు పంచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు.
ఇప్పటికే కోడి కత్తులు స్వాధీనం
కత్తికట్టి కోడిపందేలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని హెచ్చరిస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కోడి కత్తులు నూరుతూనే ఉన్నారు. ఇటీవల గోపాలపురం మండలం హుకుంపేట గ్రామంలో కోడిపందేల నిర్వహణకు కత్తులు తయారు చేస్తున్నారని వచ్చిన సమాచారంతో ట్రెయినీ ఎస్సై పి.శివ గణేష్ ఆ కేంద్రంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సాన పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి 40 కత్తులను, తయారీకి ఉపయోగించే మోటారు, సానపట్టే యంత్రం, ఇనుప చువ్వలు సీజ్ చేశారు.


