ఏడు వారాల స్వామి.. సదా స్మరామి
ఫ అన్ని దారులూ వాడపల్లికే..
ఫ భక్తజనంతో నిండిన వెంకన్న క్షేత్రం
కొత్తపేట: ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి క్షేత్రం భక్తజనంతో నిండిపోయింది.. ప్రతి నోటా శ్రీనివాసా.. శ్రీ వేంకటేశా నామస్మరణ ప్రతిధ్వనించింది.. శనివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం కిక్కిరిసింది. శుక్రవారం రాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. సాధారణ, ‘ఏడు వారాలు – ఏడు ప్రదక్షిణలు’ నోము ఆచరిస్తున్న భక్తులతో వాడపల్లి పులకించింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. అర్చకుల ఆశీర్వచం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించున్నారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈఓ చక్రధరరావు భక్తులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. ఆయన ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరాలను పరిశీలించారు. తాగునీరు, పిల్లలకు బిస్కెట్ల పంపిణీ, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ఉచిత వాహనాలు తదితర సేవలను అందించారు.


