యూత్‌త్తి హామీలు..!
● ప్రజా వ్యతిరేకతను మూటగట్టి..
చంద్రబాబు ప్రభుత్వం ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటూ ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కింది. వేలాది మంది వలంటీర్లకు హామీ ఇచ్చినప్పటికీ విధులు నుంచి పక్కన పెట్టింది. ఇలా అన్ని రంగాల్లోని యువతను ప్రభుత్వం మోసం చేసింది. 18 నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంది. రానున్న రోజుల్లో యువతకు పోరాటమే శరణ్యం. –ఎం.గంగా సూరిబాబు,
రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ, కాకినాడ
ఫ చంద్రబాబు పాలనలో యువత దగా
ఫ అమలు కాని హామీలు
ఫ ఉద్యోగ, ఉపాధి మార్గాలు మృగ్యం
ఫ పోరాడుతున్న విద్యార్థి సంఘాలు
ఫ రేపు జాతీయ యువజన దినోత్సవం
కపిలేశ్వరపురం / రాయవరం: లేవండి.. మేల్కొనండి..లక్ష్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి. పడిపోవడం కాదు.. లేచి నిలబడక పోవడమే ఓటమి.. ఇవి వివేకానందుని మాటలు. వాటి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో యువత దగా పడుతోంది.. విద్యార్థులు, యువకుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందంటూ వేదికలపై ఉపన్యాసాలు చేస్తున్న పాలకులు క్షేత్రస్థాయిలో మాత్రం వారికి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. ప్రస్తుత కూటమి పాలనలో యువత అన్ని రంగాల్లో ఇబ్బంది పడుతోంది. ఈ నెల 12వ తేదీ సోమవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.
యువతకు తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని, జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నియమించిన వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇచ్చి కొనసాగిస్తామంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హామీలు గుప్పించారు. యువత కేంద్రంగా సంక్షేమ పాలన సాగిస్తున్న అప్పటి వైఎస్సార్ సీపీ సంక్షేమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఆ తరహా హామీలు గుప్పించిన సంగతి 18 నెలల చంద్రబాబు పాలనా తీరే తెలియజేస్తుంది. కాకినాడ జిల్లాలో 620 సచివాలయాల పరిధిలో 12,272 మంది వలంటీర్లు, కోనసీమ జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో 9,581 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో 9,117 మంది వలంటీర్లను చంద్రబాబు ప్రభుత్వం విధులకు దూరంగా పెట్టింది. వారికి ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కింది. పరిమితమైన డీఎస్సీ నియామకం తప్ప ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు మృగ్యమయ్యాయి.
గలాసు ఫుల్..
చంద్రబాబు ప్రభుత్వం మద్యం అమ్మకాలతో ఖజానా నింపుకొంటుంది. అందరినీ మత్తులో తూగిస్తోంది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో 155 పైవేట్ మద్యం దుకాణాలు, 20 బార్లు, కోనసీమ జిల్లాలో 169 షాపులు, 10 బార్లు, తూర్పుగోదావరి జిల్లాలో 154 మద్యం షాపులు, 19 బార్ల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగిస్తోంది. ఇందులో అత్యధిక షాపులు జనావాసాలు, ఆలయాలు, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లో గత ఏడాది డిసెంబర్ 31న రూ.21.10 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయని లెక్కలు చెబుతున్నాయి. యువత కూడా ఎక్కువగా మద్యానికి బానిసవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 2025లో 249 కేసుల్లో 920 మంది నమోదు కాగా, అందులో అత్యధికులు యువకులున్నారు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని నిపుణులు అంటున్నారు.
చెప్పారు.. మరిచారు
నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం కింద ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఉద్యోగాలిచ్చిన దాఖలాలు చంద్రబాబు ప్రభుత్వానికి లేకపోయింది. పేద కుటుంబాల వారికి పాతిక కిలోల బియ్యం కాదు పాతికేళ్ల భవిష్యత్ ఇస్తానంటూ 2024 ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉపన్యాసం ఇచ్చారు. 18 నెలలు కావొస్తున్నా ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం నుంచి అవకాశాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లో యువత మోసపోతున్న ఘటనలు అనేకం జరిగాయి. రాజమహేంద్రవరం కేంద్రంగా ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగాల ఆశ చూపి ఏడాది కాలంలో రూ.75 లక్షలు కాజేసిందంటూ అందిన ఫిర్యాదుపై పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేయడం ఇందుకు ఒక ఉదాహరణ.
యువజన దినోత్సవం నేపథ్యమిదీ
యువత ప్రాధాన్యం గుర్తించి వారికి దిశానిర్దేశం చేసిన భారతీయ మేధావుల్లో స్వామి వివేకానంద ప్రముఖులు. ఆయన జీవిత కాలమంతా యువత కేంద్రంగానే ఉపన్యాసాలు, రచనలు సాగాయి. విభిన్న సంస్కృతులు, భాషలూ కలిగిన భారత దేశానికి దివిటీ యువతగా ఆయన నొక్కి చెప్పారు. 1984 నుంచి భారత ప్రభుత్వం వివేకానందుని జన్మదినమైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తోంది.
వివేకానందుని బాటలో..
ఉమ్మడి జిల్లాలో పలువురు యువత స్వామి వివేకానంద చూపిన బాటలో ముందుకు సాగుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి వెంకటగిరిలోని శ్రీస్వామి వివేకానంద సేవా భారతి సంస్థ విద్యార్థులకు విద్యా బోధనతో పాటు నిరుపేదలకు వస్త్రదానం, వైద్య సేవలను అందిస్తుంది. రాజమహేంద్రవరంలో స్వర్ణాంధ్రా సేవా సంస్థ 1998 నుంచి నిరుపేదలకు అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ తదితర సేవా కార్యక్రమాలను చేస్తుంది. అమలాపురం, మండపేట, రామచంద్రపురం, కాకినాడ, ఇంద్రపాలెం తదితర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, ఆటలు పోటీలు నిర్వహిస్తూ యువతను మేల్కొల్పుతున్న సంస్థలనేకం ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 51.54 లక్షల జనాభా ఉంది. ఇందులో 0–14 వయసు పిల్లలు 24 శాతం, 15–24 మధ్య యువత 19 శాతం మంది ఉన్నారు. ఏటా యువత 0.35 శాతం పెరుగుతోంది. ఈ యువతలో సగటు వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది.
తమదైన శైలిలో పోరాటం
ప్రభుత్వ విధానాలపై యువత తమదైన శైలిలో పోరాడుతోంది. ఎన్నికలు హామీలను నెరవేర్చాలంటూ వలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాలు యువత పోరు పేరుతో ఉద్యమిస్తున్నాయి. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్ 3న కాకినాడ జేఎన్‌టీయూకే వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బెల్ట్ షాపులను ఎత్తివేయాలని, మద్యం షాపులను రద్దు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు.
యూత్‌త్తి హామీలు..!
యూత్‌త్తి హామీలు..!


