
రంగంపేట/రాజమహేంద్రవరం రూరల్: అప్పుల పాలైన ధాన్యం వ్యాపారి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తాను మృతిచెందినట్లు శవపేటికలో ఉన్న మృతదేహాన్ని తీసుకువచ్చి పెట్రోలు పోసి కాల్చి నమ్మించేందుకు చేసిన ప్రయత్నం పోలీసుల విచారణలో బెడిసికొట్టింది. చివరకు ధాన్యం వ్యాపారితో పాటు, అతనికి సహకరించిన ముగ్గురు కటకటాల పాలయ్యారు. రంగంపేట మండలం పాతవీరంపాలెం గ్రామశివారు కేతమల్లు వెంకటేశ్వరరావు(పూసయ్య) జీడిమామిడితోటలో ఈ నెల 26వ తేదీన కాలిన మృతదేహం ఉండడంతో వీఆర్‌వో ఫిర్యాదు మేరకు రంగంపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహం వెంకటేశ్వరరావుదిగా భావించి పోస్టుమార్టం కోసం అనపర్తి ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు భార్య అతని మృతదేహంపై పడి తీవ్రంగా ఆవేదన చెందుతున్న విషయం తెలుసుకున్నాడు. దీంతో అతను వెంటనే భార్యకు ఫోన్ చేసి ఎవరో బాడీని తగులబెట్టి తనను కొట్టి తుప్పల్లో పడవేశారని చెప్పాడు. వెంకటేశ్వరరావు బతికి ఉండడంతో కాలిన మృతదేహం ఎవరిదో తెలుసుకునేందుకు రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అనపర్తి సీఐ పి.శివగణేష్, రంగంపేట ఎస్సై పి.విజయకుమార్ దర్యాప్తు చేపట్టారు. దీంతో నిందితుడు అసలు విషయాన్ని బయట పెట్టాడు.
వీరంపాలెం గ్రామానికి చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు(పోసియ్య)కు అప్పులు ఎక్కువగా ఉండడంతో తన పేరుపై ఉన్న రూ. కోటి ఇన్సూరెన్‌న్స్‌ను క్లయిమ్ చేసుకొనేందుకు ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్‌ను అమలు చేసేందుకు హుకుంపేట గ్రామానికి చెందిన వందే శ్రీను, తలారి సుబ్బారావు, మోరంపూడికి చెందిన సిరాచిన్నాలతో వెంకటేశ్వరరావును వినియోగించాడు. ఒక శవాన్ని తీసుకొచ్చి తన పొలంలో కాల్చేయాలని నిర్ణయించాడు. ఆ ముగ్గురితో రూ.రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు ఈ నెల 25వ తేదీ రాత్రి పాతబొమ్మూరులోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఒక శవాన్ని తవ్వి బయటకు తీశారు.
సదరు మృతదేహాన్ని శ్రీను కారులో వేసుకొని రాత్రి ఒంటి గంట ప్రాంతంలో పాత వీరంపాలెం వెళ్లి వెంకటేశ్వరరావుకు తెలిపాడు. ఇద్దరూ కలిసి శవాన్ని తగులబెట్టి అక్కడనుంచి పరారయ్యారు. ఈ నెల 26వ తేదీన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ కాలిపోయిన బాడీ వెంకటేశ్వరరావుది అని భావించి శవాన్ని అనపర్తి హాస్పిటల్‌కు తరలించారు, అనంతరం గ్రామంలో తన భార్య, పిల్లలు కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని శ్రీను ద్వారా తెలిసి, ఎవరో బాడీని తగులబెట్టి తనని కొట్టి తుప్పల్లో పడేసారని డ్రామా మొదలెట్టాడు. చివరకు పోలీసులు వెంకటేశ్వరరావు, అతనికి సహకరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం డ్రామా బయటపడింది.
ఆ మృతదేహం నెల్లి విజయరాజుది
పాతబొమ్మూరు క్రైస్తవ శ్మశానవాటికలో తస్కరించిన మృతదేహం బొమ్మూరు గ్రామానికి చెందిన ఓఎన్‌జీసీ ఉద్యోగి నెల్లి విజయరాజుదిగా పోలీసులు గుర్తించారు. నెల్లివిజయరాజు అనారోగ్యంతో ఈనెల 23వ తేదీన మృతిచెందారు. ఈ నెల 24న ఖననం చేశారు. 29న అతని జ్ఞాపకార్థకూడిక నిర్వహించారు. అయితే మంగళవారం రంగంపేట పోలీసులు నిందితులను తీసుకుని పాతబొమ్మూరు శ్మశానవాటిక వద్దకు వెళ్లే వరకు గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు నెల్లి విజయరాజు మృతదేహాన్ని తీసుకువెళ్లి పెట్రోలుతో దహనం చేశారన్న విషయం తెలియలేదు. పోలీసులు విజయరాజు ఖననం చేసిన చోట తవ్వించి చూడగా అందులో మృతదేహం కనిపించలేదు. అనపర్తి హాస్పిటల్‌లో ఉన్న మృతదేహం విజయరాజుదిగా ఆయన కుటుంబసభ్యులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పాతబొమ్మూరులోని శ్మశానవాటికకు తీసుకువచ్చి ఖననం చేశారు.