ప్రభుత్వ రోదనాస్పత్రి
● రాజమహేంద్రవరం
బోధనాస్పత్రిలో రోగుల అవస్థలు
● ప్రాణమంటే లెక్కలేదు..
కుర్చీకి దిక్కు లేదు
● చక్రాల కుర్చీ లేక క్షతగాత్రుడి
ఆర్తనాదాలు
● అంబులెన్స్‌లో వచ్చిన వృద్ధుడి అవస్థలు
● అందుబాటులో లేని వైద్య సిబ్బంది
సాక్షి, రాజమహేంద్రవరం: ‘బాబ్బాబు.. సక్రాల కుర్చీ తీసుకురండయ్యా.. నా బిడ్డ బయట రక్తమోడుతున్నాడు.. కదల్లేక కుప్పకూలిపోయాడు... ఒక్కగానొక్క బిడ్డయ్యా.. ఆడి కంట్లో నీళ్లు సూత్తే.. నా కంట్లో నెత్తురొత్తందయ్యా... అదిగోండయ్యా... ఆ కేకలు ఆడివే.. తట్టుకోలేక ఏడుస్తున్నాడు.. రండయ్యా, వచ్చి సాయం సేయండి బాబూ.. పోనీ సక్రాల కుర్చీ అయినా ఇవ్వండయ్యా’ అంటూ ఓ తల్లి తన బిడ్డకు వైద్యం అందించేందుకు రోదించిన తీరు అక్కడున్న వారిని కన్నీళ్లు తెప్పించింది. ఆమె కుమారుడు కాలికి గాయంతో కదల్లేని స్థితిలో అత్యవసర విభాగం ఎదుటే కూలబడ్డాడు. తన బాధను డాక్టర్లు పోగొడతారని నమ్మకంతో వచ్చి దిక్కుతోచని దీనస్థితిలో ఒంటరి వాడై రోదించాడు. తనను తరలించే సాయం లేక, మండుటెండలో చర్మం కాలిపోతున్నా రక్తమోడుతున్న కాలికి తెల్లబట్ట చుట్టుకుని వైద్యమో రామచంద్రా అంటూ విలపించాడు. గంటకు పైగా ప్రత్యక్ష నరకం చూశాడు.. ఈ ఘటన రాజమహేంద్రవరం బోధనాస్పత్రిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...
మండుటెండలో కుప్పకూలి..
రాజమహేంద్రవరానికి చెందిన 36 ఏళ్ల మణికంఠ పెయింటర్‌గా పనిచేస్తూ భార్య, బిడ్డలు, తల్లిని పోషించుకుంటున్నాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వచ్చి మణికంఠను ఢీకొట్టడమే కాకుండా కాలిపై నుంచి వాహనాన్ని పోనిచ్చేశాడు. దీంతో అతడి ఎడమ కాలి పాదం నుజ్జునుజ్జు అయింది. సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, గాయం చూసిన వైద్య సిబ్బంది తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో బాధితుడు తన తల్లి, భార్యతో కలిసి రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు వచ్చాడు. ధర్మాసుపత్రిలో రక్తమోడుతున్న అతడి గాయాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అత్యవసర విభాగం ఎదురుగా వచ్చి సత్తువ లేక మండుటెండలోనే కూప్పకూలిపోయాడు. తాను కదల్లేకపోతున్నానని చక్రాల కుర్చీ తీసుకురండని బోరున విలపించాడు. చివరికి, వృద్ధురాలైన తల్లి, అనారోగ్యంతో ఉన్న అతడి భార్య వార్డులన్నీ తిరిగి ఓ వీల్ చైర్ తీసుకొచ్చారు. ఇద్దరూ కలిసి అతి కష్టం మీద మణికంఠను వీర్ చైర్‌లోకి ఎక్కించి వైద్యం కోసం తీసుకెళ్లారు.
మరో ఘటన
పై ఘటన చోటు చేసుకున్న కొద్ది సేపటిలోనే మరో అత్యవసర కేసు వచ్చింది. 108 అంబులెన్సులో ఓ వృద్ధుడిని వైద్యం కోసం తీసుకొచ్చారు. అతడి వెంట భార్య, కుమార్తె ఉన్నారు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని అత్యవసర విభాగంలో వైద్యం అందించాల్సి ఉండగా అంబులెన్సు డ్రైవరు ఎమర్జెన్సీ ఎదుట వాహనాన్ని నిలిపి చక్రాల కుర్చీ, తరలించే సిబ్బంది కోసం ఎదురు చూశారు. అంబులెన్సు వచ్చి ఆగినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అంబులెన్సు డ్రైవరు ఆసుపత్రి లోపలికి వెళ్లి స్ట్రెచ్చర్ తీసుకొచ్చాడు. ఆ పెద్దాయనను ముగ్గురు కలిసి స్ట్రెచర్‌లో వైద్య సేవల కోసం తీసుకెళ్లారు.
కాలి గాయంతో అత్యవసర విభాగం ఎదుటే కుప్పకూలిన మణికంఠ వీల్ చైర్ తీసుకువచ్చి మణికంఠను వైద్యం కోసం తరలిస్తున్న భార్య, తల్లి
నిబంధనలు ఇవీ..
రాజమహేంద్రవరం బోధనాస్పత్రిలో అత్యవసర వైద్యం అందని ద్రాక్షగా మారింది. నిబంధనలు అనుసరించి అత్యవసర విభాగం బయట ప్రమాదకర స్థితిలో వచ్చే రోగుల కోసం చక్రాల కుర్చీ, స్ట్రెచర్, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు అందుబాటులో ఉండాలి. అయినా ఇక్కడ మాత్రమే అలాంటివేమీ కనిపించడం లేదు. అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారిని వారి బంధువులే తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇందుకు పై రెండు ఉదాహరణలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరో వైపు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాత్రం ఆస్పత్రిలో అన్ని వసతులు కల్పిస్తున్నామని, ప్రతి వారం ఆస్పత్రిని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వెరసి పేదలకు ప్రభుత్వ వైద్యం అందడం లేదు. అత్యవసర విభాగానికి వచ్చే కేసులన్నీ దాదాపు ప్రాణాపాయంతోనే వస్తాయని, అలాంటి బాధితులను ఆస్పత్రి సిబ్బంది, అధికారులు వహిస్తున్న అలసత్వం ఏమాత్రం సరికాదని రోగులు, వారి కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వ రోదనాస్పత్రి
ప్రభుత్వ రోదనాస్పత్రి


