సొసైటీల రుణాలే రైతులకు ఆధారం
● సమ్మెతో వారికి ఇబ్బందులు
● సహకార ఉద్యోగుల డిమాండ్లను
చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చాలి
● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు
జక్కంపూడి విజయలక్ష్మి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (ఏపీఏఎస్) ద్వారా రైతులు రుణాలు పొంది, పంటలు పండిస్తూ జీవనం సాగిస్తారని, అటువంటి సొసైటీల్లో పనిచేసే ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో వారి మనుగడ కష్టంగా మారుతోందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు, ఆ పార్టీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరం శ్యామలా సెంటర్‌లోని డీసీసీబీ కార్యాలయం వద్ద సహకార ఉద్యోగులు మూడో రోజు శనివారం చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొని సహకార ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఆమె మాట్లాడుతూ సహకార ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ జీవో నంబర్ 36ను అమలు చేసే వరకు సహకార ఉద్యోగుల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జేటీ రామారావు సహకార ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట రామయ్య, ఏఐబీఈఏ మాజీ నాయకులు తోట రామారావు, జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, కోశాధికారి సుధాకర్‌వర్మ, ఉపాధ్యక్షుడు వీరభద్రం, వెంకటేశ్వరరావు, సీహెచ్ సూర్యచంద్రశేఖర్, ఎస్.అప్పారావు, డివిజన్‌లోని సహకార ఉద్యోగులు పాల్గొన్నారు.


