మగ్గానికి పగ్గం | - | Sakshi
Sakshi News home page

మగ్గానికి పగ్గం

Feb 22 2026 7:13 AM | Updated on Feb 22 2026 7:13 AM

మగ్గా

మగ్గానికి పగ్గం

చేనేతను పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌

అమలు కాని రూ.25 వేల ఆర్థిక సాయం

నేడు మంగళగిరిలో ‘చేనేత గర్జన’

కపిలేశ్వరపురం: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య విధానాలతో చేనేత మగ్గాలకు పగ్గాలు పడుతున్నాయి. చేనేత స్టాళ్ల నిర్వహణ పేరుతో పాలకులు హంగామా చేస్తున్నారే తప్ప, చేనేత సంఘాలకు కానీ, కార్మికులకు కానీ ఆర్థిక చేయూత నివ్వడం లేదు. బడ్జెట్‌లో తగిన కేటాయింపులూ చేయలేదు. దీంతో నేతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరిలో చేనేత గర్జన పేరుతో కథం తొక్కనున్నారు. చేనేత పరిశ్రమను గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాపాడుకుంటూ వచ్చారు. జగన్‌ పాలనలో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయమందించారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేనేత పరిశ్రమను విస్మరించింది. జగన్‌ ఇచ్చిన దానికి మరో రూ.వెయ్యి అదనంగా వేసి ఏటా రూ.25 వేలు ఇస్తానంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్నా చిల్లిగవ్వ కూడా సాయమందించలేదు. 30 శాతం రిబేట్‌, పావలా వడ్డీ విడుదల చేయడం లేదు. చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలను అడుగుతుంటే ఆర్థిక పరిస్థితి బాలేదంటూ కాలం వెల్లదీస్తున్నారు. కాగా.. బకాయిలు చెల్లించాలంటూ నేతన్నలు అనేక సార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను అందజేశారు. ప్రభుత్వం వాటిని విస్మరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత గర్జనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 16 భాగస్వామ్య సంఘాలతో కలిసి మంగళగిరిలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.

కరోనాలోనూ జగన్‌ సాయం

కరోనా కాలంలో రాష్ట్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ నేతన్న నేస్తం సాయాన్ని ఆపలేదు. కరోనా కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఒక విడత సాయాన్ని షెడ్యూలు కంటే ముందే అందజేసి ఆదుకున్నారు.

– ముప్పన వీర్రాజు, మాజీ ఆప్కో డైరెక్టర్‌, పెద్దాపురం

మగ్గానికి పగ్గం 1
1/1

మగ్గానికి పగ్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement