కూటమి గూడుపుఠాణి | - | Sakshi
Sakshi News home page

కూటమి గూడుపుఠాణి

Nov 24 2026 12:24 AM | Updated on Nov 24 2026 12:24 AM

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త ఊళ్లను తలపించేలా రూపుదిద్దుకున్న జగనన్న కాలనీలు నేడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వీటిని పూర్తి చేస్తే గత ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో.. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా పేదల సొంతింటి ఆశను నీరుగారుస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

సాక్షి, అమలాపురం: ఒకప్పుడు అక్కడ ఎక్కడ చూసినా ఖాళీ భూములు.. చుట్టూ పచ్చని పొలాలు.. జనసంచారం అంతంతమాత్రం. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వరుసగా ఇళ్లు దర్శనమిస్తున్నాయి. కొత్త రహదారులు, విద్యుత్‌ స్తంభాలు, నివాస గృహాలతో కొత్త పల్లెలు రూపుదిద్దుకుంటున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన జగనన్న కాలనీలతో జిల్లాలో కొత్త ఆవాస ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఒకప్పుడు ఊళ్లకు దూరంగా ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి.

జిల్లావ్యాప్తంగా కొత్త ఆవాసాలు

జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో జగనన్న కాలనీలు రూపుదిద్దుకున్నాయి. మండల కేంద్రమైన ఆలమూరులో ఎర్ర కాలనీ, ఐ.పోలవరం మండలం పాత ఇంజరం, కొత్త మురమళ్ల, అల్లవరం మండలం బోడసకుర్రు, ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి, ఆత్రేయపురం మండలం ర్యాలి, రాజోలు మండలం శివకోడు సహా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ కాలనీలు ఏర్పాటయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు గృహ నిర్మాణాలు కూడా చేపట్టారు. కొన్నిచోట్ల వరుసగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యి, నివాసాలకు సిద్ధమవుతుండగా, మరికొన్నిచోట్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సొంత స్థలం లేక అద్దె ఇళ్లలోనో, ఇతరుల ఇళ్లలోనో కాలం వెళ్లదీస్తున్న పేద కుటుంబాలకు ఇంటి స్థలం లభించడం ఒక భరోసాగా మారింది. స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం తోడ్పాటునందించింది.

జగన్‌ పాలనలో చకచకా..

గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో ఇంటి స్థలాలను మహిళల పేరిట కేటాయించారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. ఇసుక, ఇనుము, సిమెంట్‌ వంటి నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సమకూర్చింది. దీంతో, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పనులు చకచకా ముందుకు సాగాయి. ఆ కాలనీలతో కేవలం ఇళ్ల నిర్మాణమే కాకుండా గ్రామాల విస్తరణకు కూడా అవకాశం ఏర్పడింది. జనాభా పెరుగుతున్న గ్రామాల్లో నివాస స్థలాల కొరత కొంతవరకు తీరే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో కుటుంబాలు నివాసం ఉంటే స్థానికంగా కిరాణా దుకాణాలు, ఇతర చిన్న వ్యాపారాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. గత జగన్‌ ప్రభుత్వ హయాంలోనే పలు కాలనీలకు రవాణా, తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. మిగిలిన పనులను చంద్రబాబు సర్కార్‌ పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఉంటే జగనన్న కాలనీలు మరింత అభివృద్ధి చెందేవి. మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేవారు.

కూటమి సర్కారు నిర్లక్ష్యం

● అధికారంలోకి వస్తే పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలిస్తామని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను గాలికొదిలేశారు. పైగా గత ప్రభుత్వ హయాంలో జోరుగా సాగిన జగనన్న కాలనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై కూడా తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు.

● ఆలమూరు మండలంలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలతో పాటు గ్రావెల్‌ రోడ్లు, విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు చెబుతున్నారు.

● ఐ.పోలవరం మండలం మురమళ్లలో సుమారు 200 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, ప్రస్తుతం మౌలిక సదుపాయాల పనులను కూటమి సర్కారు నిలిపివేసింది. ఇదే మండలం కేశనకుర్రులో 200 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినప్పటికీ, కాలనీ అభివృద్ధికి అవసరమైన భూమి చదును, రహదారుల నిర్మాణం చేపట్టలేదు. ఇతర ప్రాంతాల్లోని జగనన్న కాలనీల అభివృద్ధిపై కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇదేవిధంగా నిర్లక్ష్యం చూపుతోంది.

జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణం వివరాలు

లే అవుట్లకు సేకరించిన భూమి 1,188 ఎకరాలు

పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు 66,207

గత వైఎస్సార్‌ సీపీ పాలనలో

పేదల సొంతింటి దిశగా అడుగులు

జిల్లావ్యాప్తంగా భారీ లే అవుట్లు

జోరుగా పక్కా ఇళ్ల నిర్మాణాలు

జగనన్న కాలనీలతో ఏకంగా

కొత్త ఊళ్ల ఆవిర్భావం

వీటిపై కూటమి సర్కారు అక్కసు

మౌలిక సదుపాయాల కల్పనను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement