పొమ్మన్నా పోకుండా.. | - | Sakshi
Sakshi News home page

పొమ్మన్నా పోకుండా..

Nov 24 2026 12:24 AM | Updated on Nov 24 2026 12:24 AM

● మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రమాణ స్వీకారం

వేళ నిబంధనలకు పాతర

● హాలులో కిక్కిరిసిన కూటమి నేతలు

● వేదికపై మహిళా కౌన్సిలర్లతో

పాటు భర్తలు

● బయటకు వెళ్లిపోవాలని

అధికారులు చెప్పినా బేఖాతరు

అమలాపురం టౌన్‌: ఎన్నికల నిబంధనల మేరకు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులోకి చైర్మన్‌, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, పాత్రికేయులకు మాత్రమే అనుమతి ఉంది. కానీ, కొత్త చైర్మన్‌, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార వేళ కూటమి నేతలు షరా మామూలుగానే నిబంధనలను తుంగలో తొక్కారు. వందలాదిగా కౌన్సిల్‌ హాలులోకి చేరుకున్నారు. దీంతో, అమలాపురం కొత్త కౌన్సిల్‌ ప్రమాణ స్వీకారం రసాభాసగా మారింది. అనుమతి లేని ఇతరులందరూ బయటకు వెళ్లిపోవాలంటూ ఎన్నికల అధికారి, డీఆర్‌డీఏ పీడీ డి.రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ వి.నిర్మల్‌ కుమార్‌ తదితర అధికారులు మైక్‌లో పదేపదే చెప్పినా వారి మాటలను కూటమి నేతలు ఖాతరు చేయలేదు. ఓవైపు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే మరోవైపు చైర్మన్‌ నల్లా శ్రీధర్‌ను కూటమి నేతలు దండలు వేసి, బొకేలు ఇస్తూ సత్కరించారు. డీఆర్‌డీఏ పీడీ రాంబాబు ఒక్కో కౌన్సిలర్‌ను వేదిక పైకి ఆహ్వానించి, ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఆ సమయంలో మహిళా కౌన్సిలర్లతో పాటు వారి భర్తలు లేదా కుమారులు కూడా వేదిక పైకి వచ్చి, వారి పక్కనే నిలబడి ఉండటంతో అధికారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారానికి కౌన్సిలర్‌ ఒక్కరే రావాలని పీడీ రాంబాబు పదేపదే మైక్‌లో విజ్ఞప్తి చేసినా ఎవరూ లెక్క చేయలేదు. ఒక దశలో కౌన్సిల్‌ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారా లేక వారిని అభినందించేందు ఏర్పాట్లు చేశారా అనే సందేహం అధికారుల్లోనే కలిగింది. హాలు కిక్కిరిసిపోవడంతో ఎవరేం మాట్లాడుతున్నారో.. ఏం చేస్తున్నారో తెలీయనంత గందరగోళం ఏర్పడింది. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే చైర్మన్‌ పోడియం పైకి కూటమి నాయకులు ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు వచ్చేసి సత్కరించారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాలని, దయచేసి హాలు ఖాళీ చేయాలని పీడీ, కమిషనర్‌ పదేపదే మైక్‌లో అభ్యర్థించినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు 20 నిమిషాల సమయం ఇచ్చి, ఆలోగా హాలులో చైర్మన్‌, కౌన్సిలర్లు, అధికారులు, పాత్రికేయులు మాత్రమే ఉండాలని, మిగిలిన వారందరూ బయటకు వెళ్లాలని అధికారులు సీరియస్‌గా హుకుం జారీ చేశారు. అయినప్పటికీ కొద్దిమంది మినహా పలువురు కూటమి ముఖ్య నాయకులు అక్కడే ఉండిపోవడం విమర్శలకు తావిచ్చింది. గత్యంతరం లేక అధికారులు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement