అమలాపురం రూరల్: జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను పూర్తి కచ్చితత్వంతో పూర్తి చేయాలని జనగణన డైరెక్టర్ జె.నివాస్ అన్నారు. జనాభా లెక్కల సేకరణపై కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా చార్జ్ స్థాయి అధికారుల శిక్షణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండో దశ జనగణన ప్రక్రియపై అవగాహన కల్పించారు. క్షేత్ర స్థాయిలో నివసిస్తున్న వారితో పాటు తాత్కాలికంగా లేకపోయినా అదే ఇంట్లో ఉండే వారిని, సందర్శకులను, విదేశీయులను కూడా లెక్కించాలని స్పష్టం చేశారు. తొలిసారిగా లెక్కింపు కాలాన్ని 35 రోజులకు పెంచారని, అదనంగా ఐదు రోజుల పునఃపరిశీలనతో కలిపి మొత్తం 40 రోజుల సమయం లభిస్తుందని, ఒక్కో ఎన్యూమరేటర్‌కు 120 నుంచి 180 వరకూ కుటుంబాలుంటాయని వివరించారు. కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, జనాభా గణన తదుపరి దశ మార్చి వరకూ కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ జీవీ చంద్రకళ, సీపీఓ మురళీకృష్ణ, కలెక్టరేట్ ఏఓ నాగలక్ష్మి పాల్గొన్నారు.
రొయ్య పిల్లల సేకరణకు
పకడ్బందీ నిబంధనలు
అమలాపురం రూరల్: గోదావరిలో రొయ్య పిల్లల సేకరణకు పకడ్బందీ నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మత్స్య శాఖ కమిషనర్ ఆర్‌ఎస్ నాయక్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి ఉన్న 175 గేట్ల ఆధునీకరణ పనులు సుమారు రూ.200 కోట్లతో జరుగుతున్నందున బ్యారేజీ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో గేట్లకు 500 మీటర్ల దిగువన మాత్రమే రొయ్య పిల్లల సేకరణ జరిగేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కె.కరుణాకరరావు కూడా పాల్గొన్నారు.
గడువులోగా సర్ ప్రక్రియ
అమలాపురం రూరల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను గడువులోగా పారదర్శకంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అమలాపురం కలెక్టరేట్ నుంచి ఆయన పాల్గొని, సర్ ప్రక్రియతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు పురోగతిని వివరించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు, వివరాల్లో మార్పులు, చేర్పులకు సుమారు 5 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకూ 2,500 మంది ఉపాధ్యాయ ఓటర్లను నమోదు చేశామన్నారు. 4,500 మందికి పైగా ఉపాధ్యాయుల వివరాలు సేకరించామని తెలిపారు. డిసెంబర్ 23వ తేదీ నాటికి అర్హులైన ఉపాధ్యాయులందరి నుంచీ దరఖాస్తులు స్వీకరించి, ఓటర్లుగా నమోదు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు.
రత్నగిరిపై అత్యవసర బదిలీలు
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఏఈఓ, సూపరింటెండెంట్లను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు మంగళవారం ఆదేశాలిచ్చారు. అన్నదానం ఏఈఓగా పని చేస్తున్న బలువు సత్య శ్రీనివాస్‌ను అంతగా ప్రాధాన్యం లేని నిత్య పూజల సెక్షన్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రసాదం విభాగం సూపరింటెండెంట్ జె.రామకృష్ణను నియమించారు. వ్రతాల విభాగం సూపరింటెండెంట్ యనమల అప్పారావును అకౌంట్స్ విభాగం సూపరింటెండెంట్‌గా నియమించారు. సన్నిధి, కేశఖండనశాల సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న చిక్కాల సాయిబాబాను ప్రసాదం విభాగం సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆలయ సూపరింటెండెంట్ పి.రమేష్‌బాబును సెంట్రల్ స్టోర్స్‌కు బదిలీ చేయగా ఆయన స్థానంలో అక్కడి సూపరింటెండెంట్ పి.లక్ష్మీనారాయణను నియమించారు. అదనంగా పీఆర్‌ఓ, రిసెప్షన్, ప్రొటోకాల్ డ్యూటీలు కూడా అప్పగించారు. ఏఈఓ కృష్ణప్రసాద్‌ను పీఆర్‌ఓ విధుల నుంచి తప్పించారు. ఈఓ పేషీలో సూపరింటెండెంట్‌గా ఉన్న కంచి సత్యనారాయణమూర్తిని వ్రతాల విభాగం సూపరింటెండెంట్‌గా నియమించారు. అత్యంత కీలకమైన కార్తిక మాసం మధ్యలో అత్యవసరంగా ఈ బదిలీలు చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో కొత్త ఈఓ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఈ బదిలీలు జరగడం విశేషం.


