నాడు గ్రామ స్వరాజ్యం..నేడు ప్రగతి పూజ్యం | - | Sakshi
Sakshi News home page

నాడు గ్రామ స్వరాజ్యం..నేడు ప్రగతి పూజ్యం

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

● వైఎస్సార్‌ సీపీ హయాంలో

సచివాలయ వ్యవస్థకు పునాది

● ప్రతి సచివాలయానికీ

సొంత భవనం ఉండేలా నిర్మాణాలు

● రెండున్నరేళ్లుగా ముందుకు

సాగని భవన నిర్మాణ పనులు

● కూటమి ప్రభుత్వం వచ్చాక

మందగించిన సేవలు

సాక్షి, అమలాపురం: గ్రామంలోనే ప్రభుత్వ సేవలు.. ప్రజల గడప వద్దకే పాలన.. ఇదీ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం. పింఛన్లు, సంక్షేమ పథకాలు మొదలుకొని వివిధ ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఈ అపూర్వ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో గ్రామ స్వరాజ్యానికి, స్థానిక సుపరిపాలనకు కీలక కేంద్రాలుగా నిలిచిన ఈ సచివాలయాలు చంద్రబాబు పాలనలో రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ/వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చింది. అక్కడితో సరి.. క్రమంగా ఈ వ్యవస్థకు ప్రభుత్వం ప్రాధాన్యం తగ్గిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు శాశ్వత భవనాల నిర్మాణ పనులను కూడా అర్ధాంతరంగా నిలిపివేశారు. ఫలితంగా పలు గ్రామాల్లో అసంపూర్తి నిర్మాణాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

పునాదులకే పరిమితం

జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సచివాలయ భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగా, మరికొన్నిచోట్ల వీటి నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. కొత్తపేట మండలం వాడపాలెం, అల్లవరం మండలం కొమరిగిరిపట్నం, మామిడికుదురు మండలం పెదపట్నం వంటి గ్రామాల్లో నిర్మించిన భవనాలు గతంలోనే అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు కొత్తపేట మండలం వానపల్లి పరిధి సుబ్బరాజుపేట, అల్లవరం మండలం దేవగుప్తం, మామిడికుదురు ప్రాంతాల్లో ప్రస్తుత ప్రభుత్వ నిరాదరణతో సచివాలయ భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పునాదులు, పిల్లర్ల దశలోనే పనులను నిలిపివేశారు. నిధుల విడుదల, మిగిలిన పనుల పూర్తిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు.

గ్రామీణ పాలనకు దూరమవుతున్న ప్రజలు

సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో చిన్నచిన్న ప్రభుత్వ పనుల కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సిన బాధ గ్రామీణులకు తగ్గింది. గ్రామంలోనే ఉద్యోగులు అందుబాటులో ఉండటంతో ప్రజలకు సేవలు సులభంగా అందేవి. అయితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఫలితంగా సిబ్బంది విధులు, సేవల నిర్వహణలో చోటు చేసుకుంటున్న మార్పులు ఈ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. రకరకాల పనుల పేరుతో ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మరోవైపు సొంత భవనాలు లేనిచోట విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నాడు: రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో

నిర్మించిన సచివాలయం

నేడు: రామచంద్రపురం మండలం తాళ్లపొలంలో

ముందుకు సాగని సచివాలయ భవన నిర్మాణం

278 భవనాలు పూర్తి.. 96 పెండింగ్‌

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శాశ్వత భవనాలు సమకూర్చాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మొత్తం 384 భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం రూ.140.52 కోట్ల అంచనాతో పనులు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలోనే రూ.78.89 కోట్ల వ్యయంతో 278 భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 10 భవనాలు నిర్మాణ దశలో ఉండగా.. మిగిలిన 96 భవనాల పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈలోగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచీ సచివాలయాల భవన నిర్మాణాలపై సర్కారు నిరాదరణ చూపుతోంది. దాదాపు రెండున్నరేళ్లుగా పనులు ముందుకు సాగడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement