● తీరం చేరేకొద్దీ భయపెడుతున్న తుపాను
● రేపు యానాం – దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం
● ఐఎండీ తాజా హెచ్చరికలతో
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
● భారీ వర్షాలు కురిసే సూచన
● కోతల దశలో వరి
● రైతుల గుండెల్లో గుబులు
సాక్షి, అమలాపురం: ఒకవైపు గత తుపాన్ల గాయాలు ఇంకా మానలేదు. మరోవైపు ఆక్వాన్ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన ఆక్వాన్ కోనసీమ రైతులను కలవరపెడుతోంది. తొలుత నెల్లూరు – విశాఖపట్నం మధ్య ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తొలుత అంచనా వేసింది. అయితే, ఈ తుపాను దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర వైపు పయనిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆక్వాన్ తుపాను యానాం – ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల మధ్య శుక్రవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అయితే, దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్‌టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. కోస్తా జిల్లాల్లోని పలుచోట్ల గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. తుపాను రాకకు సూచనా అన్నట్లుగా సాయంత్రం సమయంలో కోనసీమలో అకాశం ఎర్రబారింది.
దిశ మారినా.. వాన ముప్పు తప్పదా!
ఆక్వాన్ ఉత్తరాంధ్ర వైపు మళ్లడంతో జిల్లాపై తుపాను గాలుల తీవ్రత తగ్గవచ్చు కానీ భారీ వర్షాలు తప్పవని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నేలనంటిన వరి చేలు, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు వర్షాలకు తడిస్తే మరింత తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. పొలాల్లో నీరు నిలిచిపోతే కోతలు, ధాన్యం ఆరబెట్టడం మరింత కష్టమవుతుంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 1,25,640 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం కోతలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకూ 5 శాతం కూడా పూర్తి కాలేదని అంచనా. ఆలమూరు, కొత్తపేట, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో కొంతమంది రైతులు కోతలు కోసి ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబెడుతున్నారు. ఇప్పటికే అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో వరి చేలు నేలకొరిగి నీట మునిగాయి. దీంతో, కోసిన ధాన్యం ఆరబెట్టి, తేమ తగ్గించే పనిలో రైతులున్నారు. నేలనంటిన వరి చేలను తిరిగి నిలబెట్టి కట్టలు కట్టుకోవడం వారికి భారంగా మారింది. ఇందుకు అదనపు కూలీలు అవసరం కాగా, ఇప్పటికే కూలీల కొరత వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో కోతకు వచ్చిన పంటను ఎలాగోలా ఒడ్డుకు చేర్చుకోవాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తడిసిన ధాన్యం మరోసారి వర్షానికి తడిస్తే మొలకెత్తడం, రంగు మారడం, నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది. పొలాల్లో నీరు నిలిస్తే మిగిలిన పంట కోతలు కూడా నిలిచిపోతాయి. తుపాను దిశ మారడం, గాలుల తీవ్రత తగ్గే అవకాశం కొంత ఊరటనిస్తున్నా.. భారీ వర్షాల ముప్పు మాత్రం రైతులను వెంటాడుతోంది.


