తుమ్మలపల్లి నామినేషన్‌ ప్రక్రియపై విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

తుమ్మలపల్లి నామినేషన్‌ ప్రక్రియపై విచారణ జరపాలి

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

● నిబంధనలకు విరుద్ధంగా స్వీకరించిన నామినేషన్‌ను తిరస్కరించాలి

● కలెక్టర్‌, ఆర్‌డీఓలకు వైఎస్సార్‌ సీపీ నేతల ఫిర్యాదు

అల్లవరం: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ చివరి రోజైన మంగళవారం గడువు ముగిసిన తర్వాత వచ్చిన తుమ్మలపల్లికి చెందిన అభ్యర్థి నుంచి నామినేషన్‌ ఎలా స్వీకరిస్తారని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా స్వీకరించిన నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌, మాజీ ఎంపీ చింతా అనురాధ, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పినిపే శ్రీకాంత్‌లు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ను అమలాపురంలోని ఆయన బంగ్లాలో మంగళవారం రాత్రి వారు కలిశారు. మొగళ్లమూరు సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ ప్రక్రియకు తుమ్మలపల్లి సర్పంచ్‌ అభ్యర్థి వడ్డి సుభాషిణి నిర్ణీత సమయానికి రాకపోవడం, నామినేషన్‌ పత్రాలు సక్రమంగా లేకపోవడం, టోకెన్‌ జారీ తదితర అంశాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వివరించారు. గడువు దాటిన తర్వాత వచ్చిన సుభాషిణికి టోకెన్‌ జారీ చేసి, నామినేషన్‌ స్వీకరించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. నామినేషన్‌ స్వీకరణ, టోకెన్‌ జారీ తదితర అంశాలపై సీసీ ఫుటేజీ ఆధారంగా పరిశీలన జరిపి, వాస్తవాలను ప్రజలకు వివరించాలని అనురాధ, శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. నామినేషన్‌ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, కూటమి నేతలకు అండగా ఉండి, సుభాషిణితో సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయించారని అనురాధ చెప్పారు. కాగా, ఈ వ్యవహారంపై ఆర్‌డీవో సరళావతికి కూడా బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా స్వీకరించిన సుభాషిణి నామినేషన్‌ను రద్దు చేయాలని, ఈ వ్యవహారానికి సహకరించిన ఎన్నికల అధికారి, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి రామారావు, తుమ్మలపల్లి ఎంపీటీసీ సభ్యుడు పందిరి సూర్యనారాయణ, నాయకులు పులుసుగంటి గంగాధర్‌, కాట్రు శాంతికిరణ్‌, బళ్ల శ్యామ్‌, కాండ్రేగుల శ్రీను, కుడుపూడి దుర్గారావు, బర్రే సీతారత్నం, కట్టా బాపూజీ, చెల్లి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement