● ఉలిక్కిపడిన నగరం గ్రామం ● తాడివారిమెరకలో భీకర శబ్దంతో ఎగజిమ్మిన గ్యాస్ ● ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు తీసిన గ్రామస్తులు
మామిడికుదురు: తెలతెల్లవారుతుండగానే నగరం గ్రామంలోని తాడివారిమెరకలో బ్లో అవుట్ ఏర్పడిందన్న వార్త కోనసీమను దావానలంలా చుట్టేసింది. స్థానికులు ప్రాణభయంతో పరుగుపరుగున సురక్షిత ప్రాంతాలకు చేరుకోగా.. అసలేం జరిగిందో, ఏం జరుగుతుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందారు. సరిగ్గా 12 సంవత్సరాల కిందట.. 2014 జూన్ 27వ తేదీ ఉదయం ఇదే విధంగా.. ఇదే గ్రామంలో.. ఇదే ప్రాంతానికి కూతవేటు దూరంలో.. ఇదే సమయానికి.. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) పైపులైన్ భారీగా విస్ఫోటం చెదడం.. గ్రామాన్ని అగ్నికీలలు చుట్టేయడాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ విలయంలో ఏకంగా 23 మంది సజీవదహనమైపోయిన ఘోరాన్ని గుర్తుకు తెచ్చుకుని భీతితో వణికిపోయారు. ఏం జరుగుతోందో కొద్దిసేపు అర్థం కాక భయాందోళనలతో ఆ ప్రాంతం నుంచి దూరంగా పరుగులు తీశారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యం
బ్లో అవుట్ జరిగిన ప్రాంతానికి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ లీకేజీ తీవ్రత, నియంత్రణ చర్యలపై ఓఎన్జీసీ అధికారులతో చర్చించారు. అక్కడే ఉండి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని వారిని తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. గ్యాస్ లీకేజీని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఓఎన్జీసీ అధికారులకు స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో పోలీసు, అగ్నిమాపక శాఖల సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రక్షణ, సహాయక చర్యలు ముమ్మరం చేశారని తెలిపారు. గ్యాస్ లీకేజీని పూర్తిగా అదుపులోకి తెచ్చేంత వరకూ సంబంధిత శాఖల అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజలకు అవసరమైన సహాయక సేవలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుద్దీపాలు, అగ్నికి సంబంధించిన పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని, నిప్పు లేదా మంటలు వెలిగించరాదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందవద్దని, బ్లో అవుట్ ప్రాంతానికి దూరంగా ఉంటూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, ఎస్పీ కోరారు. కాగా, సంఘటన స్థలాన్ని రాజోలు, పి.గన్నవరం ఎమ్మెల్యేలు దేవ వరప్రసాద్, గిడ్డి సత్యనారాయణ, జెడ్పీటీసీ గొల్లపల్లి అమూల్య సందర్శించి, బాధితులను పరామర్శించారు.
వాటర్ అంబరిల్లాతో...
బ్లో అవుట్ జరిగిన ప్రాంతంలో ఆరు ఫైరింజన్ల ద్వారా నలువైపుల నుంచీ వాటర్ అంబరిల్లా ఆపరేషన్ చేపట్టారు. చమురు లేదా సహజవాయువు బావుల్లో బ్లో అవుట్ జరిగినప్పుడు, అక్కడ ఉత్పన్నమయ్యే తీవ్రమైన వేడిని తగ్గించడానికి, మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి బావి చుట్టూ నిరంతరాయంగా నీటిని ఒక గొడుగు లేదా తెర ఆకారంలో పిచికారీ చేసే అత్యవసర రక్షణ ప్రక్రియనే వాటర్ అంబరిల్లా ఆపరేషన్ అంటారు. ఉదయం ప్రమాదం జరిగిన 5 గంటల నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బ్లో అవుట్ అదుపులోకి వచ్చేంత వరకూ నిరంతరాయంగా ఈ ప్రక్రియను కొనసాగించారు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు బావి లోపలికి మడ్ పంపింగ్ చేసి, బ్లో అవుట్‌ను పూర్తిగా అదుపు చేశారు. దీంతో, సుమారు 10 గంటల పాటు కొనసాగిన బ్లో అవుట్ ఉత్కంఠకు తెర పడింది. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మేనేజర్, ఈడీ హేమంత్ రాములు ముల్కా ప్రమాదం స్థలిలోనే ఉండి నియంత్రణ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. తాటిపాక–7 బావి వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, మడ్ పంపింగ్ చేసి, బావిని మూసివేశామని, వెల్ క్యాపింగ్ చేశామని తెలిపారు. ప్రజలు ఎటువంటి ఆందోళనా చెందనవసరం లేదని చెప్పారు.
గ్యాస్ కిక్ ఇవ్వడంతో...
తాడివారిమెరకలో 216వ నంబర్ జాతీయ రహదారి బైపాస్ పక్కన డీప్ కంపెనీకి చెందిన డీఆర్–31 రిగ్‌తో తాటిపాక–7 బావిలో రీ డ్రిల్లింగ్ చేశారు. భూగర్భంలో 2,300 మీటర్ల లోతున ఒక చదరపు అంగుళం విస్తీర్ణంలో 3,500 పౌండ్ల మేర భారీగా సహజవాయువు నిక్షేపాలున్నట్లు కనుగొన్నారు. డ్రిల్లింగ్ పూర్తయిన తరువాత ఊహించనవిధంగా ఒక్కసారిగా గ్యాస్ కిక్ ఇవ్వడంతో (భూగర్భంలోని రాతి పొరల్లో ఉన్న సహజవాయువు ఒక్కసారిగా డ్రిల్లింగ్ బావిలోకి చొచ్చుకుని రావడం) బ్లో అవుట్ ఏర్పడింది. దీంతో, ఒక్కసారిగా 10 మీటర్ల ఎత్తున గ్యాస్ పైకి ఎగజిమ్మింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం తదితర శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెండువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నగరం, మామిడికుదురు గ్రామాల్లోని పలు విద్యా సంస్థలను మూసివేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పొయ్యిలు వెలిగించవద్దని నగరం, మామిడికుదురు గ్రామాల్లో మైకు ద్వారా ప్రచారం చేశారు.


