కాట్రేనికోన: మండలంలోని పల్లం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు మల్లాడి బేబీ, మల్లాడి గంగవేణి పోలీసు ఎస్కార్ట్‌తో నామినేషన్లు వేశారు. వివరాలివీ.. పల్లం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని దొంతికుర్రు గ్రామంలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు వెంబడి, కొబ్బరి తోటల్లోను కూటమికి చెందిన అల్లరి మూకలు మాటు వేయడంతో పల్లం గ్రామంలో నామినేషన్ వేసేందుకు ఇతరులెవరూ భయంతో ముందుకు రావడం లేదు. దీంతో, రెండు రోజుల్లో కూటమి మద్దతుతో ఆ గ్రామంలో ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. పరిస్థితి దారుణంగా ఉండటంతో అభ్యఽర్థులు చివరి రోజైన మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. దీంతో, ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్సై దుర్గా శ్రీనివాస్‌ల ఆధ్వర్యాన పోలీసులు ఎస్కార్ట్ కల్పించారు. తొలుత ఎస్సై ఆధ్వర్యాన పోలీసులు ఆ మార్గంలోని అల్లరి మూకలను చెదరగొట్టారు. అనంతరం, కాట్రేనికోన పోలీసు స్టేషన్ నుంచి సుమారు 30 మంది పోలీసులతో ఎస్కార్ట్ ఏర్పాటు చేసి, మల్లాడి గంగవేణి, మల్లాడి బేబీలకు రక్షణ కల్పించి నామినేషన్ కేంద్రానికి తీసుకుని వెళ్లారు. పోలీసుల రక్షణలో ఇద్దరు అభ్యర్థులూ నామినేషన్లు వేశారు. పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.


