చిక్కీల సరఫరాకు 20 రోజులుగా బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

చిక్కీల సరఫరాకు 20 రోజులుగా బ్రేక్‌

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

అమలాపురం టౌన్‌: జిల్లాలోని పాఠశాలలకు గత 20 రోజులుగా చిక్కీల సరఫరా నిలిచిపోయిందని రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు జక్కంపూడి కృష్ణ కిరణ్‌ తెలిపారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలులో మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తమకు చిక్కీలు ఇవ్వడం లేదని విద్యార్థులు చెప్పారు. దీంతో, కిరణ్‌ అక్కడి నుంచే జిల్లాలోని వివిధ మండలాల్లోని పాఠశాలలకు ఫోన్లు చేసి చిక్కీల సరఫరా నిలిచిపోవడంపై ఆరా తీశారు. తమకు చిక్కీల స్టాక్‌ రావడం లేదని పలువురు ఉపాధ్యాయులు చెప్పారు. అనంతరం, జిల్లా విద్యా శాఖ అధికారి మహబూబ్‌ బాషాకు ఫోన్‌ చేసి, జిల్లావ్యాప్తంగా చిక్కీల సరఫరా ఎందుకు నిలిచిపోయిందని ప్రశ్నించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి అంతరాయం ఉండకూడదని, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం తగదని కృష్ణ కిరణ్‌ స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు వెంటనే చిక్కీలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును కూడా కిరణ్‌ పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సిబ్బందికి పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం తయారీపై కిరణ్‌ పలు సూచనలు చేశారు.

మెర్లపాలెంలో టీడీపీకి షాక్‌

ఆత్రేయపురం: మెర్లపాలెంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూటమి పాలన, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అసంతృప్తితో ఇర్లపాటి నరసయ్య ఆధ్వర్యాన టీడీపీ నాయకులు, పలు కుటుంబాల వారు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, మంగళవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. మెర్లపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్‌ సీపీపై ప్రజల్లో నమ్మకం, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసం రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. కూటమి పాలనతో విసిగిపోయిన ప్రజలు వైఎస్సార్‌ సీపీ వైపు అడుగులు వేస్తున్నారని, గ్రామ స్థాయిలో పార్టీకి పెరుగుతున్న ఆదరణే దీనికి నిదర్శనమని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీలో చేరేందుకు మరింత మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ చేరికలతో మెర్లపాలెంలో వైఎస్సార్‌ సీపీ మరింత బలోపేతమైందని నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

20 వరకు మానవ హక్కుల

కమిషన్‌ క్యాంపు కోర్టు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కేంద్రంగా ఈ నెల 16న ప్రారంభమైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ క్యాంపు కోర్టును ఈ నెల 20 వరకూ నిర్వహిస్తామని కమిషన్‌ గౌరవ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి అన్నారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఈ క్యాంపు కోర్టులో రాజమహేంద్రవరం, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పోలవరం జిల్లాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణలతో పాటు కొత్త కేసుల స్వీకరణ జరుగుతుందన్నారు. సోమ, మంగళవారాల్లో 126 కేసుల విచారణ చేపట్టామని, వీటిలో 69 కేసులకు హెచ్‌ఆర్‌సీ క్యాంప్‌ కోర్టులో అక్కడికక్కడే తుది ఉత్తర్వులు వెలువరించామని చెప్పా రు. మిగిలిన 57 కేసులను మళ్లీ విచారించేందుకు సంబంధిత ఫిర్యాదీలకు, ప్రతివాదులకు సమా చారం ఇచ్చి, వాయిదాలు వేశామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నూతనంగా దాఖలైన 5 కేసుల విచారణ కూడా చేపట్టామని జస్టిస్‌ సత్యనారాయణమూర్తి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement