ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తరచుగా బ్లో అవుట్లు, గ్యాస్, ఆయిల్ లీకేజీలు ఏర్పడుతున్నాయని వైఎస్సార్ సీపీ రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పాముల రాజేశ్వరీదేవి, గన్నవరపు శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లో అవుట్ జరిగిన ప్రాంతాన్ని వారు పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరు తెలుసుకున్నారు. అనంతరం బాధితులను పరామర్శించారు. ఓఎన్జీసీ కార్యకలాపాలు జిల్లా ప్రజల్ని అనుక్షణం ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణలో అధికారులు తరచూ విఫలమవుతున్నారని, లోపం ఎక్కడుందో తెలుసుకుని, సరి చేయలేకపోతున్నారని విమర్శించారు. బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


