టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
● తోడైన బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు
● నామినేషన్ గడువు ముగిశాక
టోకెన్ల జారీ
● సర్పంచ్ అభ్యర్థిగా
టీడీపీ మద్దతుదారుతో
దర్జాగా నామినేషన్
● వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ
చింతా అనురాధ నిరసన
● కలెక్టర్‌కు ఫిర్యాదు
అల్లవరం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కూటమి నేతల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. అల్లవరం మండలంలో జరిగిన సంఘటనే దీనికి తార్కాణంగా నిలుస్తోంది. వివరాలివీ.. మండలంలోని తుమ్మలపల్లి, మొగళ్లమూరు తదితర గ్రామాలకు చెందిన అభ్యర్థులకు అధికారులు మొగళ్లమూరులో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఈ గ్రామాల్లో నామినేషన్ల గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది.
బలవంతంగా టోకెన్ తీసుకుని..
గడువు కంటే ముందుగా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి టోకెన్లు జారీ చేశారు. దీని ప్రకారం తుమ్మలపల్లి గ్రామంలోని వార్డుకు పోటీ చేస్తున్న కుడుపూడి దుర్గారావుకు అధికారులు 33వ నంబర్‌తో చివరి టోకెన్ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత టీడీపీ మండల అధ్యక్షుడు డి.సత్తిబాబురాజు.. ఆ పార్టీ మద్దతుదారైన తుమ్మలపల్లి సర్పంచ్ అభ్యర్థి వడ్డీ సుభాషిణిని తీసుకుని మొగళ్లమూరు సచివాలయానికి వచ్చారు. అప్పటికే సచివాలయానికి తాళం వేసి ఉంది. అయినప్పటికీ సత్తిబాబురాజు గట్టిగా చెప్పడంతో లోపలి నుంచి రమేష్ అనే వ్యక్తి వచ్చి సచివాలయం తాళం తీశాడు. దీంతో సత్తిబాబురాజు, సుభాషిణి లోపలికి వెళ్లారు. అధికారులు సుభాషిణికి 34వ నంబర్‌తో మళ్లీ టోకెన్ ఇచ్చారు.
ఎన్నికల అధికారిని నిలదీసిన మాజీ ఎంపీ
విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ చింతా అనురాధ సచివాలయం వద్దకు వెళ్లి ఎన్నికల అధికారిని నిలదీశారు. గడువు ముగిసిన తర్వాత కూడా నామినేషన్ వేయడానికి ఏవిధంగా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. దీనికి ఎన్నికల అధికారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అనురాధ అక్కడే టెంట్‌లో నిరసన తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలించి 5 గంటలకు ముందే సుభాషిణి ఇక్కడకు వచ్చినట్టు చూపిస్తే తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని, 5 గంటల తర్వాత వస్తే ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఆమె నిరసనను భగ్నం చేసేందుకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనురాధకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అయినప్పటికీ పట్టు వదలకుండా అనురాధ నిరసన తెలిపారు. ఆమెకు వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి రామారావు మద్దతు తెలిపారు.
నామినేషన్ తీసుకుంటావా? లేదా?
ఓవైపు అనురాధ నిరసన తెలుపుతుండగానే టీడీపీకి చెందిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ళ దొరబాబు మొగళ్లమూరు సచివాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలు తీసుకుంటావా లేదా అంటూ ఎన్నికల అధికారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో దిక్కుతోచని స్థితిలో టీడీపీ మద్దతుదారైన తుమ్మలపల్లి సర్పంచ్ అభ్యర్థి వడ్డీ సుభాషిణి నుంచి ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. దీనిపై మాజీ ఎంపీ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు ముగిసిన తరువాత కూడా ఎన్నికల అధికారిని బెదిరిస్తూ నామినేషన్ వేయించడమేమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి విధానాన్ని ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. నామినేషన్ల చివరి రోజున కూటమి నేతలు కుట్రలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


