సాక్షి, అమలాపురం/రావులపాలెం: స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉండటాన్ని ఇసుక అక్రమార్కులు అవకాశంగా మలచుకుంటున్నారు. జిల్లాలోని మాన్సూన్ స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచిన లక్షలాది టన్నుల ఇసుకను రాత్రివేళల్లో యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఇసుక నిల్వలపై ప్రభుత్వ లెక్కలకు, క్షేత్ర స్థాయి పరిస్థితికి పొంతన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భారీ తేడాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జిల్లాలో అమలాపురం (కామనగరువు), రావులపాడు, గోపాలపురం, జొన్నాడ, ఆలమూరుల్లో ఐదు మాన్సూన్ స్టాక్ యార్డులు ఏర్పాటు చేశారు. తొలుత ఈ ఐదు పాయింట్లలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలుండగా, ఈ ఏడాది మరో 3 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు. దీంతో నిల్వ సామర్థ్యం 7.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని అధికారులు చెబుతూ వచ్చారు. అయితే, వాస్తవ నిల్వలు, తరలింపులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ ఇసుక నిల్వలున్నట్లు సమాచారం.
లెక్కల్లో గారడీ
● అధికారుల లెక్కల ప్రకారం రావులపాలెం మండలం రావులపాడు స్టాక్ పాయింట్‌లో గత ఏడాది 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉండేది. ఈ స్టాక్ పాయింట్ నిల్వ సామర్థ్యం ఇంతే. అంతకు మించి ఉంచకూడదు. గత ఏడాది అమ్మకాలు జరగలేదు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఈ ఏడాది ఇసుక నిల్వలు పెంచేశారు. అయితే, సెప్టెంబర్ నెలాఖరుకు 1,52,803 టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఆన్‌లైన్ లెక్కల్లో చూపించారు. వాస్తవానికి అంతకన్నా ఎక్కువగానే ఇసుక నిల్వలున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత సుమారు 45 రోజులు ఇసుక అమ్మకాలు జరిగాయి. అయినప్పటికీ ఇక్కడ ఇంకా లక్ష టన్నుల వరకూ నిల్వ ఉన్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. అధికంగా ఇసుక అమ్మినప్పటికీ గడచిన 45 రోజుల్లో 52 వేల టన్నుల ఇసుక మాత్రమే విక్రయించినట్లు చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
● అమలాపురం స్టాక్ పాయింట్‌లో సెప్టెంబర్ 30 నాటికి 58,810 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు ఆన్‌లైన్ వివరాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రావులపాడు, అమలాపురం స్టాక్ పాయింట్ల నుంచే ప్రధానంగా ఇసుక తరలింపు సాగుతోంది. ఇదే వేగం కొనసాగితే నవంబర్ నెలాఖరుకు ఈ రెండు పాయింట్లు కూడా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
● రావులపాలెం మండలం గోపాలపురంలో 81,239 టన్నుల ఇసుక నిల్వ చేయగా ప్రస్తుతం దాదాపు ఖాళీ అయ్యింది. అయినప్పటికీ 2,841 టన్నులు అందుబాటులో ఉన్నట్లు లెక్కల్లో చూపిస్తున్నారు.
● జొన్నాడలో 1,00,520 మెట్రిక్ టన్నులకు గాను కేవలం 117 టన్నులు, ఆలమూరులో 1,68,283 టన్నులకు గాను 27,529 టన్నులు మాత్రమే మిగిలినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
● ఈ లెక్కలను పరిశీలిస్తే గోపాలపురం, జొన్నాడ, ఆలమూరు స్టాక్ పాయింట్లు దాదాపు ఖాళీ అయినట్లే. దీంతో రావులపాలెం, అమలాపురం స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుకకు గిరాకీ పెరిగింది. వాస్తవానికి అక్టోబర్ 15 తరువాత ర్యాంపులు తెరిచే అవకాశముంది. కానీ అర్నబ్, మురసు తుపానుల వల్ల గోదావరిలో ప్రవాహం పెరడంతో ర్యాంపులు వేసే అవకాశం లేదు. ఇది ఇసుకకు డిమాండ్ పెరగడానికి కారణమైంది.
లారీ ఇసుక రూ.10 వేలు
డిమాండ్ పెరగడాన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు ఇసుక ధరను ఒక్కసారిగా పెంచేశారు. మొన్నటి వరకూ రూ.7 వేలకే లభించిన లారీ ఇసుక ధర ప్రస్తుతం రూ.10 వేలకు చేరింది. దీనికి అదనంగా ఒక పొక్లెయిన్ బకెట్ ఇసుకకు రూ.700 చొప్పున వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పగటిపూట పరిమిత సంఖ్యలో లారీలను చూపిస్తూ.. రాత్రివేళల్లో పెద్ద ఎత్తున ఇసుక ఎగుమతులు చేస్తున్నారని చెబుతున్నారు. ఇసుకకు డిమాండ్ రావడంతో రెండేళ్లుగా ఏర్పాటు చేసిన నిల్వలను వేగంగా ఖాళీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ చేసినప్పుడు టన్ను ఇసుకకు ర్యాంపును బట్టి సుమారు రూ.135 వరకూ ధర ఉండగా.. ప్రస్తుతం రవాణా, జీఎస్టీ, లోడింగ్ కలిపి టన్నుకు రూ.310గా జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. ఈ ధరలకు అదనంగా అక్రమార్కులు వసూలు చేస్తూ, వినియోగదారులను దోచుకుంటున్నారు.
నిబంధనలు తూచ్..
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఉత్తర్వుల ప్రకారం జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకూ నదీగర్భాల్లో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఈ సమయంలో ఇసుక కొరత తలెత్తకుండా వర్షాకాలపు (మాన్సూన్) స్టాక్ యార్డులు ఏర్పాటు చేశారు. ఈ స్టాక్ పాయింట్ల నిల్వలే అక్రమ దందాకు ఇప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ముఖ్యంగా అక్టోబర్ 15 తర్వాత మాన్సూన్ స్టాక్ పాయింట్లను మూసివేయాల్సి ఉన్నప్పటికీ జిల్లాలో మాత్రం ఇసుక ఎగుమతులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే స్టాక్ పాయింట్లు నిర్వహించాలన్న నిబంధనలను అతిక్రమించి మరీ అర్ధరాత్రి వేళల్లోనూ లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. అయినప్పటికీ మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిసినప్పటికీ సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ అధికారులు ఆ పనుల్లోనే తలమునకలై ఉంటున్నారు. దీనిని ఇసుక అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఎన్నికల హడావుడిలో
అధికార యంత్రాంగం
ఇదే అదునుగా అక్రమార్కుల
ఇసుక దోపిడీ
సిండికేట్‌కు కాసులు
కురిపిస్తున్న మాన్సూన్ నిల్వలు
రాత్రి వేళల్లో యథేచ్ఛగా
ఇసుక తరలింపు
పట్టించుకోని అధికారులు


