గూడు చెదిరింది.. పండించిన కష్టం నీటపాలైంది.. చెట్లూచెమా దూరమైంది.. విద్యుత్ వ్యవస్థ నేలకొరిగింది.. చివరికి చీకటి రోజులు తెచ్చింది.. ఉపాధి లేక ప్రతి జీవికి కష్టం మిగిలింది.. ఇన్ని అవస్థల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
మలికిపురం: అర్నబ్ తుపాను కోనసీమను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా రాజోలు దీవికి కన్నీళ్లు మిగిల్చింది. ఆ వెంటనే మురసు తుపాను ధాటికి భారీ వర్షాలు మళ్లీ కుంగదీశాయి. ఎందరికో ఉపాధి దూరమైంది. ఇల్లు కూలి నిరాశ్రయులుగా మార్చింది. ఇది జరిగి 20 రోజులు గడుస్తున్నా కూటమి సర్కారు తుపాను బాధితులను కనీసం పట్టించుకోవడంలేదు. బాధితులను లెక్కించడమే కానీ.. సాయం అందించడ లేదు. తుపాను ప్రభావానికి రాజోలు నియోజకవర్గంలో సుమారు 10 వేల పైబడి గృహాలు దెబ్బతిన్నాయి. ఇందులో తాటాకిళ్లు, పెంకుటిళ్లు, డాబాలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని గ్రామాల్లో లెక్కలు వేయలేదని అధికారులు చెబుతున్నారు. కొబ్బరి చెట్లు ఇళ్లపై పడడడంతో పాటు గాలులకు నివాస గృహాలు దెబ్బతిన్నాయి. పశువుల పాకలు ఎగిరిపోయాయి. కొబ్బరి, ఇతర ఉద్యాన చెట్లు సంగతి పక్కన పెడితే తుపాను వచ్చి సుమారు 20 రోజులు దాటినా, ఇప్పటికీ వారికి ఎటువంటి సాయం అందించలేదు. ఇక సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో మొత్తం 47 గ్రామాలకు గాను సముద్ర తీరంలో ప్రాంతంలో గొల్లపాలెం, తూర్పుపాలెం, కేశనపల్లి, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, కేశవదాసుపాలెం, అంతర్వేదికర, అంతర్వేది దేవ స్థానం, పల్లిపాలెం గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికి 50 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఆయిల్, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికీ సగం మందికి కూడా అందించలేదు. ఇదిగో అదిగో అంటున్నారు. అలాగే రాజోలు మండలంలో 16 గ్రామాలతో పాటు మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సముద్ర తీర ప్రాంతాలకు వెలుపల ఉన్న మరో 53 గ్రామాల ప్రజలకు తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు కేవలం పది కిలోల బియ్యం ఇస్తామని అన్నారు. ఇంకా ఇవ్వలేదు. వాస్తవానికి ఈ కుటుంబాలు కూడా తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నవే. అయినా కూడా నేటికీ కనీస సాయం అందించలేదు. ఆయా గ్రామాల్లో బాధితులను తరికిస్తే వారి వేదన వర్ణనాతీతంగా ఉన్నాయి.
కళ్ల ముందు కదలాడుతోంది
అర్నబ్ తుపాన్ ధాటికీ తీవ్రంగా దెబ్బతిన్నాం. ిఆ కాళరాత్రి ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది. ఇంటిపై చెట్లు పడి కూలిపోవడంతో పిల్లలతో వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోయాం. మేం పేదవాళ్లం. ఇళ్లు కట్టుకోలేం. ప్రభుత్వం నేటికీ తమను కనికరించడం లేదు. ఎటువంటి సాయం చేయలేదు.
–యడ్ల సుశీల, పడమటిపాలెం,
మలికిపురం మండలం
బరకం కట్టుకున్నాం
తుపానుకు పెంకుటిల్లు పూర్తిగా ఎగిరిపోయింది. వారం రోజుల పాటు ఇళ్లంతా తడిసిపోయింది. తిరిగి వర్షాలు అంటున్నారు. ప్రభుత్వం ఇంటికి సాయం చేయలేదు. రూ.10 వేలు అప్పు చేసి బరకంతో ఇల్లు బాగు చేసుకున్నాం. ఇటువంటి తుపాను గతంలో చూడలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– నల్లి సుమతి, తూర్పుపాలెం
తుపాను బాధితులకు కానరాని సాయం
గూడు చెదిరినా పైసా విదల్చని వైనం
పంటలు పాడైనా పరిహారానికీ
మొండిచేయి
కన్నీటి పర్యంతం అవుతున్న ప్రజలు


