అమలాపురం రూరల్: ఓ చిన్నారిని చట్టబద్ధంగా సోమవారం దత్తత చేశారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) నిబంధనలను అనుసరించి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఈ దత్తత ప్రక్రియ చేపట్టామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం 10 నెలల వయస్సున్న చైత్ర కొత్తపేట మండలం వానపల్లిలోని ఉండుర్తివారిపాలెంలో ఈ ఏడాది జనవరి 29న లభించింది. ఆ చిన్నారిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అమలాపురంలోని శిశుగృహానికి తరలించి, అవసరమైన సంరక్షణ, పోషణ కల్పించారు. ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన అన్నెస్ ఫాతిమా తనకు దత్తత కావాలంటూ 2022లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆమెకు నిబంధనల ప్రకారం చిన్నారి చైత్రను చట్టబద్ధంగా దత్తత చేశారు. ఆ చిన్నారికి సురక్షితమైన ప్రేమపూర్వకమైన కుటుంబ వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో దత్తత ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.నాగమణి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.శిరీష, అమలాపురం శిశుగృహ మేనేజర్ వనజాక్షి పాల్గొన్నారు.


