సర్పంచ్‌ స్థానాలకు 604.. వార్డులకు 2,013 నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ స్థానాలకు 604.. వార్డులకు 2,013 నామినేషన్లు

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

అమలాపురం రూరల్‌: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న అమలాపురం రెవెన్యూ డివిజన్‌లోని 10 మండలాల్లో రెండో రోజైన సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌ స్థానాలకు 604, వార్డులకు 2,013 చొప్పున అభ్యర్థులు నామినేషన్లు వేశారని జిల్లా పంచాయతీ అధికారి ఎం.శాంతలక్ష్మి తెలిపారు. రెండు రోజుల్లో సర్పంచ్‌ స్థానాలకు మొత్తం 704, వార్డులకు 2,229 నామినేషన్లు వచ్చాయన్నారు. వార్డులకు మలికిపురం మండలంలో అత్యధికంగా 305 నామినేషన్లు వచ్చాయి.

రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌

రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరిగే కొత్తపేట, రామచంద్రపురం డివిజన్ల పరిధికి సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ రెండు డివిజన్లలో ని 165 గ్రామాల్లోని 1,862 వార్డుల ఎన్నికలకు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన చేపడతారు. 22 అప్పీలుకు అవకాశం ఉంటుంది. ఉపసంహరణకు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ గడువు ఇచ్చారు. అనంతరం, అభ్యర్థుల జాబితా ప్రకటించి, గుర్తులు కేటాయిస్తారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు.

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

అమలాపురం రూరల్‌: ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లూ చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 1,21,041.62 ఎకరాల్లో వరి సాగు జరగగా 3,61,859.09 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇందులో స్థానిక అవసరాలకు 33,064.65 మెట్రిక్‌ టన్నులు మినహాయించగా, సుమారు 3,28,659.86 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. జిల్లావ్యాప్తంగా 267 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని తెలిపారు. సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,441, గ్రేడ్‌–ఎ రకానికి రూ.2,461 చొప్పున కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ ఎం.బాలసరస్వతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో

మరణాల శాతం తగ్గించాలి

ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు

అమలాపురం టౌన్‌: రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం ఏటా దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 5 లక్షల మంది గాయపడుతున్నారన్నారు. వారిలో 1.50 లక్షల మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరి మృత్యువుతో పోరాడి చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల స్థలాల్లోనే వేలాది మంది చనిపోతున్నారని తెలిపారు. మిగిలిన వారు దివ్యాంగులుగా మిగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మించే ముందు డీపీఆర్‌ రూపకల్పన నిపుణుల పర్యవేక్షణలో చేపట్టాలని, రోడ్డు నిర్మాణం, నాణ్యతను బట్టి స్పీడ్‌ కెపాసిటీ సర్టిఫికెట్‌ ఇవ్వాలని, వాహనాలకు సేఫ్టీ ఆడిట్‌ సర్టిఫికెట్‌ కూడా ఇవ్వాలని ఎమ్మెల్సీ సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు, మరణాల శాతం తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో రోడ్డు ప్రమాదాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయి కానీ రోడ్డు డిజైన్‌ లోపంపై ఒక్క ఎఫ్‌ఐఆర్‌ కూడా ఇప్పటి వరకూ నమోదు కాలేదని అన్నారు. ప్రతి రోడ్డుకూ డిజైన్‌ అనే నిబంధన తప్పనిసరి చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement