సాక్షి, అమలాపురం: గత నెలాఖరులో అర్నబ్.. ఈ నెల ప్రారంభంలో మురసు.. వారం రోజుల వ్యవధిలోనే వరుసగా విరుచుకుపడిన అతి తీవ్ర తుపాన్లు కోనసీమను అతలాకుతలం చేశాయి. ఇవి చేసిన గాయాల నుంచి ఇంకా కోలుకోనే లేదు. ఈ విపత్తుల ధాటికి నేలకొరిగిన వరి చేలు ఇంకా నీటిలోనే నానుతూ కుళ్లిపోతున్నాయి. విరిగిన కొబ్బరి చెట్లు రైతుల కన్నీటికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ధ్వంసమైన అరటి తోటలు తిరిగి జీవం పోసుకునే పరిస్థితి కనిపించడం లేదు. తెగిన వలలు, విరిగిన పడవలతో మత్స్యకారుల జీవనాధారం కొట్టుకుపోయింది. ఒకవైపు పంట నష్టం.. మరోవైపు ఉపాధి కరువు.. ఇంకోవైపు వరద ముంపు.. ఇలా అర్నబ్, మురసు తుపాన్లు కోనసీమపై మానని గాయాలు చేశాయి. ఆ గాయాలు మానకముందే ఆక్వాన్ రూపంలో మరో ప్రకృతి విపత్తు ముంచుకొస్తోందన్న వార్తతో జిల్లా ప్రజల గుండెల్లో మళ్లీ తుపాను మొదలైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆక్వాన్ తుపానుగా రూపుదాల్చింది. ఇది బుధవారం నాటికి తీవ్ర తుపానుగా, ఈ నెల 19వ తేదీ నాటికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని, పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వెళ్లిన వారు వెంటనే తిరిగి తీరానికి చేరుకోవాలని హెచ్చరించింది.
గత నెల 27న జిల్లా సమీపాన తీరం దాటిన అర్నబ్ తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలులు, కురిసిన భారీ వర్షాల ధాటికి 1.08 లక్షల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. 1.16 లక్షల కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యాయి. ఉద్యాన పంటలకు రూ.54 కోట్ల నష్టం వాటిల్లింది. తరువాతి వారంలో వచ్చిన మురసు తుపానుతో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురిశాయి. ఈ విపత్తులతో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన కోనసీమ వాసులకు ఆక్వాన్ గండం పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని ఈ సమయంలో మరో తుపాను వస్తే తట్టుకోలేమని, ఉన్నదంతా ఊడ్చుకుపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఆక్వాన్ తుపాను నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాల నివారణే లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు కూడా పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. తుపాను సహాయక చర్యలకు మన మిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009ను, అత్యవసర సహాయం కోసం 112, 1070, 1800–425–0101 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కమ్యూనికేషన్ వ్యవస్థపై కలెక్టర్ సమీక్ష
తుపాను నేపథ్యంలో కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ టెలికం నెట్‌వర్క్ ప్రతినిధులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తుపాను సమయంలో నెట్‌వర్క్ వ్యవస్థలు సక్రమంగా పని చేసేలా ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత నెల అర్నబ్ తుపా ను సమయంలో సరైన సంసిద్ధత లేనందువల్లనే కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఈసారి ఎలాంటి లోపాలకూ తావివ్వకూడదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే నెట్‌వర్క్ ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత విపత్తుల గాయాల నుంచి
ఇంకా కోలుకోనేలేదు
ఇంతలోనే భయపెడుతున్న ఆక్వాన్
19 నాటికి అతి తీవ్రంగా
మారే అవకాశం


