పూర్తయిన జొన్నాడ ఫ్లై ఓవర్ వంతెన స్తంభాలు
ఆలమూరు: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలు – కీలకమైన జంక్షన్‌గా ఉన్న రావులపాలెం మధ్య రాకపోకలను సులభతరం చేయడానికి ఉద్దేశించిన జొన్నాడ ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనులు నత్తకంటే నెమ్మదిగా సాగుతున్నాయి. జాతీయ రహదారి–216ఎపై ఆలమూరు మండలం జొన్నాడ జంక్షన్ వద్ద ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ రహదారిపై ఏలూరు – రాజమహేంద్రవరం మధ్య ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ నియంత్రణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు రూ.120 కోట్లతో 5 ఫ్లై ఓవర్ వంతెనలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా రూ.43 కోట్ల వ్యయంతో రాజమహేంద్రవరంలోని మోరంపూడి సెంటర్‌తో పాటు జొన్నాడ సెంటర్‌లో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి పూనుకుంది. ఈ వంతెనలకు 2019 జనవరి 21న అప్పటి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణ పనులు 2022 సెప్టెంబర్ 22న ఒకేసారి ప్రారంభమయ్యాయి. మూడేళ్లలో వీటి నిర్మాణం పూర్తి చేయాలని ఆ సమయంలో ఆదేశాలిచ్చారు. రూ.24 కోట్లతో చేపట్టిన మోరంపూడి ఫ్లై ఓవర్ నిర్మాణం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యి, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రూ.19 కోట్లతో చేపట్టిన జొన్నాడ ఫ్లై ఓవర్ పనులు కూడా గత ప్రభుత్వ హయాంలో 70 శాతం మేర పూర్తయ్యాయి. మరో 20 శాతానికి సంబంధించిన పనులకు నిర్మాణ సామగ్రి సైతం సిద్ధమైంది. ఎనిమిది పిల్లర్లు నిర్మించారు. వాటి పైన వేయాల్సిన గడ్డర్లు, సిమెంటు స్లాబులు సైతం సిద్ధం చేశారు.
ప్రభుత్వం మారడంతో..
ఈలోగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచీ జొన్నాడ ఫ్లై ఓవర్ వంతెన పనులకు గ్రహణం పట్టింది. సిద్ధం చేసిన గడ్డర్లను పిల్లర్లపై అమర్చే పనులు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. రావులపాలెం అప్రోచ్ రోడ్డు పనులు నిలిచిపోయాయి. జొన్నాడ సెంటర్‌లో సర్వీస్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. దీంతో, రెండున్నరేళ్లుగా వాహనచోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులకు పలుమార్లు ఆదేశాలిచ్చినా, సమీక్షలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. పనుల గడువు పెంచినా కాంట్రాక్ట్ సంస్థ నుంచి స్పందన లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లినా పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ వెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడం, కాంట్రాక్టు సంస్థపై ఒత్తిడి తీసుకు రావడంలో విఫలం కావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మరో ఫ్లై ఓవర్ పనుల నేపథ్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న మార్గాల్లోని బస్టాండ్లలో ఎటువంటి సౌకర్యాలూ కల్పించలేదు. దీంతో, ఆర్టీసీ బస్సులు ఎక్కడ నిలుస్తాయో తెలియక ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.
మళ్లీ టెండర్లు పిలుస్తున్నాం
జొన్నాడ ఫ్లై ఓవర్ వంతెన పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం చూపిన పాత సంస్థ కాంట్రాక్టును ఇటీవల రద్దు చేశాం. పరిమిత సమయంలో ఈ వంతెన పనులు పూర్తి చేసే విధంగా కొత్త కాంట్రాక్టు కోసం తిరిగి టెండర్లు పిలుస్తున్నాం. డిసెంబర్ తొలి వారంలో వంతెన పనులు పునఃప్రారంభమయ్యే విధంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.
– బి.కృష్ణమూర్తి, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రాజమహేంద్రవరం
రెండున్నరేళ్లుగా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
ముందుకు కదలని
జొన్నాడ వంతెన నిర్మాణ పనులు
పిల్లర్లు పూర్తి.. గడ్డర్లూ రెడీ
వాటిని వేసేందుకు కుదరని ముహూర్తం
ఏళ్ల తరబడి
వాహనచోదకులకు ఇబ్బందులు


