సాక్షి, అమలాపురం: ఒకదాని వెంట మరొకటిగా విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులతో కోనసీమ విలవిల్లాడుతోంది. భీకర గాలులు, భారీ వర్షంతో అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే.. ఎడతెరిపి లేని వానలతో మురసు తుపాను విరుచుకుపడింది. వారం రోజుల వ్యవధిలోనే వచ్చి పడిన ఈ రెండు విపత్తులు హరిత సీమగా ఖ్యాతికెక్కిన జిల్లా అతలాకుతలమైంది. లక్షకు పైగా ఎకరాల్లో వరి చేలు నేలకొరిగి, నీట మునగడంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. కొబ్బరి రైతులకూ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇంకా ఆ నష్టాల నుంచి తేరుకోక ముందే బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడబోతోందన్న వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అది వాయుగుండంగా బలపడి భారీ వర్షాలు కురిపిస్తుందా? తుపానుగా మారి మళ్లీ విధ్వంసం సృష్టిస్తుందా అనే ఆందోళన నెలకొంది. ఇప్పటికే చేతికొచ్చిన సమయంలో ముంపు బారిన పడిన పంటను కాపాడుకోవడానికి నానాతంటాలూ పడుతున్న రైతులకు తాజా వాతావరణ హెచ్చరికలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఆక్వాన్‌గా మారితే..
ఈ నెల 11న ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, 13వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది 15వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడి నైరుతి బంగాళాఖాతం వైపు, తమిళనాడు తీరం దిశగా కదిలే అవకాశాలున్నాయని చెబుతోంది. ఇది తుపానుగా మారుతుందా లేదా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఒకవేళ తుపానుగా మారితే దానికి ఇరాన్ సూచించిన ఆక్వాన్ పేరు పెట్టనున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకూ తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నది ప్రస్తుత అంచనా. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ అల్పపీడనం తన దిశ మార్చుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. దీనివల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిస్తే ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన తాము సర్వం కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆక్వాన్ తుపాను (ఊహాచిత్రం)
భూతాపం పెరగడంతో ముప్పు
బంగాళాఖాతంలో కాలుష్యం పెరగడంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రమై, వాతావరణంలో అనూహ్య మార్పులకు కారణమవుతున్నాయి, దీని ప్రభావం వల్లనే బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాల సమయంలో తరచూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. గోదావరి, ఇతర నదుల ద్వారా వ్యర్థాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల గత పదేళ్లలో రెట్టింపయ్యింది. దీని వలన ఈ సీజన్‌లో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. గతంలో ఈ సీజన్‌లో కేవలం రెండు, మరీ అరుదుగా మూడు అల్పపీడనాలు మాత్రమే ఏర్పడేవి. కానీ, ఇప్పుడు ఏటా ఐదారు ఏర్పడుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, కర్బన ఉద్గారాలు, అడవుల నరికివేతతో భూతాపం పెరుగుతోంది. ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులు కూడా సముద్ర ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్నాయి. వీటి ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాల తీవ్రతలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అల్పపీడనాలు తుపానులుగా మారే పరిస్థితి పెరిగింది. పశ్చిమ బెంగాల్ వద్ద గంగా, ఒడిశాలో మహానది, మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో తుపానులు తీరం దాటుతున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ ముఖద్వారాల పరిసరాల్లో తుపానులు తీరం దాటే అవకాశాలు ఎక్కువ. దీనివల్లనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తరచూ తుపానుల వల్ల నష్టాలు సంభవిస్తున్నాయి. ప్రకృతి విపత్తులు తరచూ సంభవించే పరిస్థితుల్లో వాటిని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వాలు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విపత్తుల నుంచి కాపాడుకునేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఎంతైనా అవసరం. ఇదే సమయంలో ప్రకృతికి హాని చేసే చర్యలను ప్రజలు మానుకోవాలి.
– డాక్టర్ పెచ్చెట్టి కృష్ణ కిషోర్, పర్యావరణవేత్త, ఆంధ్రా యూనివర్సిటీ
సముద్ర రసాయన శాస్త్ర పరిశోధకుడు, అమలాపురం
పొంచి ఉన్న మరో ముప్పు!
బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం!
తుపానుగా మారితే ఆక్వాన్‌గా నామకరణం
ఇప్పటికే జిల్లాపై విరుచుకుపడిన
రెండు తుపాన్లు
వారం రోజుల వ్యవధిలో
హరిత సీమ అతలాకుతలం
ఆ నష్టం నుంచి కోలుకోకముందే
మళ్లీ విపత్తు భయం
వరుస తుపాన్లతో తీరని నష్టం
గత నెల 27న అర్నబ్ తుపాను జిల్లా సమీపాన తీరం దాటింది. దీని ప్రభావంతో వీచిన భీకర గాలులు, భారీ వర్షాల ధాటికి జిల్లాలో 1.18 లక్షల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. 70,500 కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యాయి. కొబ్బరితో కలిపి 29,231 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం నుంచి కోలుకోకముందే ఈ నెల 3 నుంచి మూడు రోజులపాటు మురసు తుపాను మరోసారి ప్రతాపం చూపించింది. దీని ప్రభావంతో కురిసిన కుంభవృష్టితో జిల్లా అతలాకుతలమైంది. అప్పటికే నీట మునిగిన వరి చేలకు అదనంగా ముంపు సమస్య ఎదురైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఒబ్బిడి చేసుకోవడం రైతులకు కష్టంగా మారింది. మరోసారి వర్షాలు కురిస్తే మిగిలిన పంట కూడా పూర్తిగా దెబ్బ తింటుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.


