సాక్షి, అమలాపురం: మున్సిపల్, పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు పల్లె పోరుకు రంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలు కానుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో రాజకీయ సమీకరణలు ఊపందుకుంటున్నాయి. జిల్లాలోని 342 గ్రామ పంచాయతీలు, 3,873 వార్డులకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తొలి విడతలో 10 మండలాలకు 26న..
అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం, మామిడికుదురు, అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచి 17వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 18న నామినేషన్ల పరిశీలన చేపడతారు. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటించనున్నారు.
రెండో విడతలో 8 మండలాలకు 29న..
కొత్తపేట, రామచంద్రపురం డివిజన్ల పరిధిలోని 9 మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, అయినవిల్లి, అంబాజీపేట, పి.గన్నవరం, రామచంద్రపురం, కె.గంగవరం మండలాల్లో ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. రెండు విడతల ఎన్నికలకు సంబంధించి ఆయా మండలాల్లో అవసరమైన ఎన్నికల సామగ్రి, సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
పకడ్బందీగా పర్యవేక్షణ:
గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతకు 2,272, రెండో విడతకు 2,362 చొప్పున మొత్తం 4,634 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయనున్నారు. సుమారు 4 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్నికల విధుల నిర్వహణకు మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు వెబ్‌కాస్టింగ్, వెబ్‌స్ట్రీమింగ్ సదుపాయాలు కల్పించనున్నారు. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు 1,613 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు.
పక్కాగా ఏర్పాట్లు చేయాలి
గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్యాలెట్ బాక్సులు, మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్, వెబ్‌స్ట్రీమింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్‌డీఓలు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించిన శిక్షణ తరగతులకు హాజరు కాని ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) వి.సుబ్బారావు, అమలాపురం, కొత్తపేట ఆర్డీవోలు కె.సరళావతి, జీవీవీ సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి కె.శాంతికుమారి, జిల్లా పరిషత్ సీఈఓ వసంత మాధవి, జిల్లా విద్యా శాఖ అధికారి మహబూబ్ బాషా, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 342 గ్రామ పంచాయతీలు,
3,873 వార్డులు
ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు
రెండు విడతల్లో ఎన్నికలు
తొలి విడతకు 13న, రెండో
విడతకు 16న నోటిఫికేషన్లు
ఎన్నికల సిబ్బందికి శిక్షణ
అంతకు ముందు గోదావరి భవన్‌లో డీఆర్‌ఓ సుబ్బారావు ఆధ్వర్యాన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల విధులపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు విధానం, కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల నిర్వహణ, పోలీసు బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలను వివరించారు.


