19న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

19న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నిక

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

20న జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు..

అమలాపురం రూరల్‌: ఈ నెల 19న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు, 20వ తేదీన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో ఎన్నికై న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఈ నెల 14వ తేదీలోగా నూతన కార్యవర్గాల ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్డీవోలు, జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్‌, విద్య తదితర శాఖల అధికారులతో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా పరిషత్‌ సీఈఓ వసంత మాధవి వివరించారు.

కొబ్బరి ఆధారిత

పరిశ్రమలతో ఉపాధి

అయినవిల్లి: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు కొబ్బరి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసి, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేయాలని రైతులకు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ సూచించారు. నేదునూరులోని కృషీవల కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల సంస్థను ఆయన మంగళవారం సందర్శించారు. కోకోపిట్‌, బయోచార్‌ తయారీ, కొబ్బరి కంపోస్ట్‌, పీచు, కోకో ప్రాసెసింగ్‌ యూనిట్ల పనితీరును పరిశీలించారు. ఆయా ఉత్పత్తుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా పరిశ్రమలను మరింత విస్తరించి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంస్థ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందించాలని కృషీవల ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు. కొబ్బరి వ్యర్థాలతో బయోచార్‌ తయారీ విధానాన్ని కలెక్టర్‌కు సంస్థ సీఈఓ ఎ. గోపాలకృష్ణ వివరించారు. వ్యవసాయంలో దీని వినియోగం వల్ల భూసారం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి బీవీ రమణ, సంస్థ ప్రతినిధి గణపతి వీర రాఘవులు, కొబ్బరి రైతులు పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్‌ జిల్లా సెక్రటరీగా కృష్ణ కిశోర్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ తూర్పు గోదావరి జిల్లా సెక్రటరీగా కోరుకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ దారపురెడ్డి కృష్ణ కిశోర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్‌ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, ఆయన జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, జిల్లాలోని అందరినీ సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ కార్యకలాపాలను విస్తృతం చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement