ప్రతిపక్షాలను వేధించడం చంద్రబాబు నైజం | - | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలను వేధించడం చంద్రబాబు నైజం

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

● కేసులు, పోలీస్‌ స్టేషన్లు నాకు కొత్తేమీ కాదు

● మాజీ మంత్రి అంబటి రాంబాబు

కిర్లంపూడి: వైఎస్సార్‌ సీపీ నాయకులను, ప్రతిపక్షాలను వేధించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నైజమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. విచారణ నిమిత్తం మంగళవారం ఆయన కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. తొలుత మాజీ మంత్రి, దివంగత నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకుని, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముద్రగడ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం, కార్యకర్తలతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు కాలినడకన బయలుదేరగా, అనుమతి లేదంటూ పోలీ సులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పడంతో అంబటి, వైఎస్సార్‌ సీపీ ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ముద్రగడ గిరిబాబు, దవులూరి దొరబాబు కారులోనే పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరారు.

గంటన్నర పాటు విచారణ

డీఎస్పీ ఏజీబీ తిలక్‌ ఆధ్వర్యాన అంబటి రాంబాబును సుమారు గంటన్నర పాటు పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. అనంతరం, అంబటి విలేకర్లతో మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభాన్ని బతికున్నంత కాలం వేధించి, కాపు జాతి కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్షలను భగ్నం చేసి, ఆయన కుటుంబంపై దాడులకు తెగబడి, ఆయనను ఏదో ఒక విధంగా జైలులో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అన్నారు. అలాంటి నేత మరణించిన తరువాత ప్రభుత్వ లాంఛనాలు వద్దని కుటుంబ సభ్యులు సైతం చెప్పినప్పటికీ పోలీసులు దొంగచాటున వచ్చి గౌరవ వందనాలు చేస్తామనడం, తుపాకులు పేల్చుతామనడం ఏమిటని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం ఒక యోధుడని, కాపుల హక్కుల కోసమే కాకుండా అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడిన మహా నాయకుడని చెప్పారు. ఆయన చివరి కోరిక తీర్చడం తమ బాధ్యతని స్పష్టం చేశారు. ఆయనకు ఇష్టం లేని ప్రభుత్వ లాంఛనాలు ఎందుకు చేస్తున్నారని పోలీసులను నిలదీస్తే అది పెద్ద నేరం అయిపోయిందని అన్నారు. దీంతో, తనపై కేసు పెట్టి విచారణకు పిలిచారన్నారు. తానేదో అంతర్జాతీయ నేరస్తుడినన్నట్లు సుమారు రెండు గంటల పాటు అనేక ప్రశ్నలు వేశారని చెప్పారు. కేసులు, పోలీస్‌ స్టేషన్లు తనకు కొత్తేమీ కాదన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చట్టబద్ధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement