కోనసీమ కుదేలు | - | Sakshi
Sakshi News home page

కోనసీమ కుదేలు

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

● అంచనాలకు మించి

పెరుగుతున్న నష్టాలు

● 1.18 లక్షల ఎకరాల్లో దెబ్బ తిన్న వరి

● వెన్ను విరిగి విలవిలలాడుతున్న అన్నదాత

● ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు

● 50 గంటలకు పైగా

అంధకారంలోనే పల్లెలు, పట్టణాలు

● తాగునీటికీ తిప్పలు

● తుపాను తీరం దాటి 24 గంటలు

గడిచినా తీరని కష్టాలు

సాక్షి, అమలాపురం: చీకట్లు తొలగలేదు. దాహం తీరలేదు. దెబ్బ తిన్న గూళ్లు బాగు పడలేదు. తుపాను తీరం దాటి 24 గంటలు గడిచినా కష్టాల సుడిగుండం నుంచి కోనసీమ బయట పడలేదు. ప్రకృతి ప్రకోపం తగ్గినా ప్రజల బాధలు మాత్రం తగ్గలేదు. చేతిలో డబ్బులున్నా అవసరమైన సేవలు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. పెనుగాలులకు కూలిన ఇళ్లు, ఎగిరిపోయిన పైకప్పులు, చెల్లాచెదురైన సామగ్రితో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోని రైతులు ఖరీఫ్‌లో 1.53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, తుపాను ప్రభావంతో ఏకంగా 1.18 లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల్లో తేలింది. పంటల నష్టంతో అటు రైతులకు, బోట్ల ధ్వంసంతో ఇటు మత్స్యకారులకు ఉపాధి దెబ్బ తింది. తొలుత వేసిన ప్రాథమిక అంచనాలకు మించి నష్టం తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

దీపాలు వెలగక.. ఫ్యాన్లు తిరగక..

విద్యుత్‌ సరఫరా 50 గంటలకు పైగా నిలిచిపోవడంతో పల్లెలు, పట్టణాలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఇళ్లల్లో దీపాలు వెలగడం లేదు. ఫ్యాన్లు తిరగడం లేదు. దీంతో, ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మొబైల్‌ ఫోన్లలో చార్జింగ్‌ అయిపోవడంతో అత్యవసర సమాచారం తెలుసుకోవడం, బంధువులతో మాట్లాడటం కూడా కష్టంగా మారింది. విద్యుత్‌పై ఆధారపడిన అనేక సేవలు నిలిచిపోవడంతో రోజువారీ పనులు ముందుకు సాగడం లేదు. మరమ్మతులు పూర్తి చేసి సరఫరా పునరుద్ధరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నా, విస్తృతంగా దెబ్బ తిన్న వ్యవస్థను చక్కదిద్దడం సవాలుగా మారింది. జిల్లా కేంద్రమైన అమలాపురంతో పాటు మూడు నాలుగు మండల కేంద్రాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే గురువారానికి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించగలిగారు. తీర మండలాల్లోని శివారు గ్రామాలకు వెళ్లేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది.

నీటికీ ఇక్కట్లే..

విద్యుత్‌ సరఫరా లేక మున్సిపాలిటీలు, పంచాయతీల్లో మోటార్లు పని చేయకపోవడంతో కుళాయిల ద్వారా తాగునీరు అందడం లేదు. దీంతో, గుక్కెడు నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో 20 లీటర్ల నీటి టిన్నును రూ.40 నుంచి రూ.50 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నీటి కొనుగోలు అదనపు భారంగా మారింది. తాగునీరు, విద్యుత్‌ అందుబాటులో లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు అందించడంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ పూర్తిగా విఫలమైంది.

గూడు చక్కదిద్దుకునే పనిలో..

పెనుగాలుల ధాటికి దెబ్బ తిన్న ఇళ్లల్లో ఉంటున్న వారి కష్టాలు వర్ణనాతీతం. ఎగిరిపోయిన పైకప్పులను కొబ్బరాకులు, అందుబాటులో ఉన్న సామగ్రితో సరి చేసుకుంటున్నారు. గాలికి చెల్లాచెదురైన ఇంటి వస్తువులను ఏరుకుని తెచ్చుకుంటూ, విరిగిన కర్రలను సరి చేసుకుంటూ మళ్లీ నివాసయోగ్యంగా మార్చుకునే పని లో నిమగ్నమయ్యారు. తడిసిన సామగ్రిని ఆరబెట్టుకుంటున్నారు. కొందరికి నిలువ నీడ లేకుండా పోయింది. బాధితులకు తక్షణ సాయం అందించి, విద్యుత్‌, తాగునీటి సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తు నుంచి కోనసీమ కోలుకోవాలంటే సహాయక చర్యలు మరింత వేగవంతం కావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement