చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే జేబులో డబ్బుల్లేకపోయినా ఫర్వాలేదనే ధీమా.. క్షణాల్లో జరిగే డిజిటల్ చెల్లింపులు.. నిమిషానికో అప్‌డేట్ ఇచ్చే సోషల్ మీడియా..డిజిటల్ యుగంలో ముందుకు దూసుకుపోతున్నామనే ఆలోచనలను ఒక్క తుపాను తుడిచిపెట్టేసింది. ప్రకృతి ముందు మనిషి ఎప్పుడూ తక్కువే అని నిరూపించింది. భారీ వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోవడంతో సెల్‌ఫోన్లు మూగబోయాయి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సాక్షి, రాజమహేంద్రవరం: ఆధునిక కాలంలో మానవుడు ఎన్నో డిజిటల్ సౌకర్యాలు పొందుతున్నాడు. ఇంటిలోనే కూర్చుని ఫోన్ ద్వారా తన పనులన్నీ చేసుకుంటున్నాడు. అయితే ఈ సాంకేతికను అర్నబ్ తుపాను బెంబేలు పెట్టించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మొబైల్ ఫోన్లకు చార్జింగ్ లేక, నెట్‌వర్క్ సరిగ్గా, అందక, ఇంటర్నెట్ సేవలు అస్తవ్యస్తమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతిలో ఫోన్ ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ ప్రపంచానికి అలవాటుపడిన జనం ఒక్కసారిగా ఆఫ్‌లైన్ జీవితంలోకి వెళ్లాల్సి వచ్చింది. డిజిటల్ దూకుడుకు ప్రకృతి కళ్లెం వేసింది.
చార్జింగ్ లేక అవస్థలు
స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం మాట్లాడేందుకు మాత్రమే కాదు. వార్తలు తెలుసుకోవడం, బ్యాంకు లావాదేవీలు నిర్వహించడం, ప్రయాణ వివరాలు చూడటం, అత్యవసర సమాచారం చేరవేయడం వంటి ఎన్నో పనులకు ఆధారంగా మారింది. అలాంటి ఫోన్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చార్జింగ్ సమస్య ఎదురైంది. ఇప్పటికే చార్జింగ్ ఉన్న ఫోన్లలోనూ నెట్‌వర్క్ అంతరాయాలు ఇబ్బందులకు గురిచేశాయి. జిల్లా జనాభా సుమారు 23 లక్షలకు పైగా ఉంది. వారంతా సుమారు 8 లక్షలకుపైగా ఫోన్లు వాడుతున్నారని ఓ అంచనా. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో జియో, బీఎస్‌ఎనన్‌ఎల్ వంటి నెట్‌వర్క్ సేవలు సరిగ్గా అందకపోవడంతో కాల్స్, ఇంటర్నెట్ వినియోగానికి ఆటంకాలు ఏర్పడ్డాయి.
అకౌంట్లలో డబ్బులున్నా..
ఇంటర్నెట్ సేవలు దెబ్బతినడంతో డిజిటల్ చెల్లింపులు చెల్లింపులకు ఆటంకాలు ఎదురయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రోజువారీ సుమారు రూ.5 కోట్ల వరకూ ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతాయి. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, దుకాణాల వద్ద డిజిటల్ చెల్లింపు లు ఎక్కువ. అలాంటి చోట ఫోన్‌పే చేయలేక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ బంకు ల వద్ద వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నా చేతిలో నగదు లేక అవసరమైన వస్తువులు కొనుగోలు చేయలేని పరిస్థితి కొందరికి ఎదురైంది. తెలిసిన వారిని చేబదులు అడిగినా వారి వద్ద కూడా నగదు లేకపోవడంతో అవస్థలు తప్పలేదు. .
సోషల్ మీడియాకు దూరం
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్‌లోనే కాలక్షేపం చేసే అలవాటు చాలా మందికి ఉంది. వాట్సాప్ సందేశాలు, ఫేస్‌బుక్ పోస్టులు, ఇన్‌స్ట్రాగామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో సమయం గడిపేవారు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో అసహనానికి గురయ్యారు. నిమిషానికోసారి ఫోన్ చూసే అలవాటున్నవారు తాజా పోస్టులు, సందేశాలు చూడలేక ఇబ్బందిపడ్డారు. మరో వైపు తుపాను పరిస్థితులపై సమాచారం తెలుసుకోవాలన్నా నెట్ అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది.
బోసిపోయిన బస్టాండ్, రైల్వేస్టేషన్
భారీ ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు కూలి రహదారులపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, మండపేట డిపోల నుంచి సర్వీసులన్నింటినీ బుధవారం ఆర్టీసీ అధికారులు పూర్తిగా రద్దు చేశారు. గురువారం వాతావరణం సద్దుమణగడంతో సర్వీసులు పునరుద్ధరించారు. మరోవైపు రోడ్లపై అడ్డంకుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోవడం, మరికొన్ని చోట్ల రాకపోకలు ఆలస్యం కావడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర పనులపై బయలుదేరినవారు సైతం గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వచ్చింది.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
తుపాను ప్రభావంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది. సుమారు 32 రైళ్లు రద్దు కావడం, మరికొన్ని సేవల్లో మార్పులు చోటుచేసుకోవడంతో రాజమహేంద్రవరం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రైళ్ల వివరాలు తెలుసుకోవడం, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం కూడా కొందరికి సమస్యగా మారింది. సాధారణంగా ప్రయాణికులతో రద్దీగా కనిపించే రైల్వే స్టేషన్ తుపాను ప్రభావంతో బోసిపోయింది.
అర్నబ్ పంజాతో
మూగబోయిన ఫోన్లు
అస్తవ్యస్తమైన ఆధునిక టెక్నాలజీ
విద్యుత్ కట్, ఇంటర్నెట్ బంద్
డిజిటల్ చెల్లింపులకు బ్రేక్


