20 మందిని రక్షించిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది | - | Sakshi
Sakshi News home page

20 మందిని రక్షించిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది

Oct 30 2026 12:21 AM | Updated on Oct 30 2026 12:21 AM

కాకినాడ క్రైం: అర్నబ్‌ తుపాను ఉధృతికి అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన వాణిజ్య నౌక సిగ్మపెర్ల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతమైంది. కాకినాడ కోస్ట్‌గార్డ్‌ కల్నల్‌ రంజిత్‌ ఆధ్వర్యంలో సిబ్బంది నౌకలో ప్రయాణిస్తున్న 20 మందిని రక్షించారు. సుజయ్‌ నౌక కోస్ట్‌కార్డు సిబ్బందిని విజయవంతంగా సిగ్మపెరల్‌ వద్దకు చేర్చింది. గురువారం నిర్వహించిన ఈ రెస్క్యూలో సాంకేతిక కీలక పాత్ర పోషించింది. విశాఖపట్నం నుంచి సింగపూర్‌ వెళ్తున్న వాణిజ్య నౌకలో 20 మంది సిబ్బంది ఉండగా వారంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. నౌక పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. నౌక పొట్టభాగం (హల్‌), అంతర్గత యంత్రాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా, సమీప తీరానికి నౌకను చేర్చగలమా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

గంజాయి తరలిస్తున్న

యువకుడి అరెస్ట్‌

అనపర్తి: గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని అనపర్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్సై వి.సుజాత తెలిపిన వివరాల ప్రకారం.. అనపర్తి ఐఎల్‌టీడీ జంక్షన్‌ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా జీబీఆర్‌ కళాశాల ఎదురుగా ఉండే కాలనీలో నివాసం ఉండే కొల్లాటి శ్రీతేజ అనే 19 ఏళ్ల యువకుడి వద్ద రూ.2 లక్షల విలువైన నాలుగు కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. అతడిని విచారించగా వివిధ పోలీస్టేషన్ల పరిధిలో 9 మోటార్‌ బైక్‌లను కూడా చోరీ చేసినట్టు అంగీకరించాడన్నారు. దీంతో ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

బాలికను అపహరించి..

లైంగిక దాడి

నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

అడ్డతీగల: బాలిక అదృశ్యం కేసులో అడ్డతీగల పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు రంపచోడవరం డీఎస్పీ అష్రష్‌ ఆలీ గురువారం అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. అడ్డతీగల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక అక్టోబర్‌ 20వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ మేరకు అందిన ఫిర్యాదుతో అడ్డతీగల సీఐ బి.వినోద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అడ్డతీగల పోలీసులు వేగంగా స్పందించి అదృశ్యమైన బాలికను సురక్షితంగా రక్షించారు. వీరభద్రపురం గ్రామానికి చెందిన పలివెల వినయ్‌ (21) అనే యువకుడు తనను అపహరించి, పలుమార్లు బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపుతానని బెదిరించాడని వివరించింది. దీంతో బాలిక అదృశ్యం కేసును, మైనర్‌పై లైంగిక దాడి, క్రిమినల్‌ బెదిరింపు, పోక్సో చట్టంలోని కఠినమైన నిబంధనల కిందకు కేసు మార్చారు. ఈ దర్యాప్తులో భాగంగా గురువారం అడ్డతీగల పోలీసులు పాపంపేట గ్రామం వద్ద నిందితుడు పలివెల వినయ్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి, రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌ కోసం తరలించారు.

యువతిని వేధిస్తున్న

యువకుడి అరెస్ట్‌

మాదాపూర్‌: యువతిని వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కాకి నాడ సమీపంలోని మాధవరానికి చెందిన నూతి గట్టు వీర వెంకట సంతోష్‌ దుర్గ (27) ఏఎంఆర్‌ గ్రూప్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ జూబ్లిహిల్స్‌లో నివాసముంటున్నాడు. నిందితుడికి, బాధితురాలికి చుట్టరికం ఉండడంతో 2022లో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అతడి అనుమానాస్పద ధోరణి నచ్చక పోవడంతో యువతి అతడితో మాట్లాడడం మానేసింది. దీంతో సంతోష్‌ దుర్గ ఆమెను మానసికంగా వేధించడం, తమ పాత ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపుతానని బెదిరించాడు. దీంతో ఆమె గచ్చిబౌలి షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. వారు కౌన్సిలింగ్‌ ఇచ్చినా వేధింపులు మానకపోవడం, ఈ నెల 28న హైటెక్‌ సిటీలోని టెక్‌ మహేంద్ర కార్యాలయానికి వెళ్లి బాధితురాలిని ఇబ్బందికి గురి చేయడంతో అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement