బోటు విరిగి ఉపాధి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

బోటు విరిగి ఉపాధి గల్లంతు

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

ఓడలరేవుకు చెందిన మత్స్యకారుడు జగదాని యేసురాజు బోటు లంగరు వేసి ఉండగా తుపాను ధాటికి విరిగిపోయింది. సునామీలో కూడా దెబ్బ తినని బోట్లు, ప్రస్తుతం ఉప్పెనలా విరుచుకుపడిన కెరటాలకు ధ్వంసమయ్యాయి. రూ.6 లక్షల విలువైన బోటు, వలలు పోయాయి. దీంతో, ఆరు కుటుంబాల వాళ్లం జీవనాధారం కోల్పో యామని, ప్రభుత్వమే ఆదుకోవాలని యేసురాజు తదితరులు వేడుకుంటున్నారు.

30 కుంచాల ఆశ కూలింది

రావులపాలెం మండలం ఈతకోటకు చెందిన కౌలు రైతు మట్టా దుర్గారావు 15 కుంచాల భూమిలో అరటి, 15 కుంచాల్లో మిర్చి, బంతి, జామ సాగు చేశారు. రూ.3 లక్షల పెట్టుబడి పెట్టారు. వారం రోజుల్లో కోతకు వస్తుందనుకున్న దశలో తుపాను ప్రభావంతో అన్ని పంటలూ నేలనంటేశాయి. చెల్లించాల్సి కౌలు, పెట్టుబడికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆయన ఆవేదన చెందుతున్నారు.

ఆశలు.. నేలపాలు

కొత్తపేట మండలం వానపల్లికి చెందిన కౌలు రైతు బల్లి మూలస్వామి ఎనిమిదెకరాల్లో అరటి సాగు చేశారు. ఎకరాకు రూ.1.50 లక్షల చొప్పున రూ.12 లక్షల పెట్టుబడి పెట్టారు. ధర బాగుండటంతో లాభాలు వస్తాయని ఆశ పడ్డారు. ఆ ఆశ తీరకుండానే గెలల దశలో వచ్చి పడిన తుపానుకు తోట మొత్తం నేలకొరిగింది. ఒక్క గెల కూడా మిగల్లేదు. కౌలు డబ్బులు, అప్పులతో ఆయన దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయారు.

రూపాయి కూడా రాదు

కె.గంగవరం కూనిమిల్లిపాడు రైతు దొమ్మేటి సుజాత ఐదెకరాల్లో వరి సాగుకు రూ.1.50 లక్షలు అప్పు చేసి, పెట్టుబడి పెట్టారు. కోతకు నెల రోజుల ముందే వచ్చిన ఈ తుపానుతో పంట నేలకు ఒరిగిపోయింది. గింజ పోసుకోలేదు. ఇప్పుడు పంట దక్కే అవకాశం కూడా లేదు. రూపాయి కూడా రాదని, పొలం బాగుకు మళ్లీ ఖర్చు తప్పదని ఆమె కన్నీరు పెట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement