ఆలమూరు: అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులందరికీ సత్వరం పరిహారం అందించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పెనికేరు, పినపళ్ల, చింతలూరు, సూర్యారావుపేట గ్రామాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి తమ్మన శ్రీనివాస్‌తో కలసి గురువారం ఆయన పర్యటించి, తుపానుకు దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు. బాధితు రైతులు, కౌలు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరగడం అత్యంత బాధాకరమని ఈ సందర్భంగా ఆయనన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, వారందరినీ ఎటువంటి షరతులూ లేకుండా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు వెంటనే పర్యటించి, పంట నష్టాలను సమగ్రంగా అంచనా వేసి, ప్రతి రైతుకూ మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు.
అభయారణ్యం అతలాకుతలం
తాళ్లరేవు: కోరింగా అభయారణ్యానికి అర్నబ్ ఎఫెక్ట్ తగిలింది. తుపాను కారణంగా సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడడం, సుమారు 12 అడుగుల ఎత్తున ఉప్పెన రావడంతో తీవ్ర నష్టం సంభవించింది. ఇక్కడ జరిగిన నష్టాన్ని మెట్రోలాజికల్ అధికారులు గురువారం పరిశీలించారు. నష్టం వివరాలను ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, సీబీఈటీ చైర్మన్ కె.లక్ష్మణరావు, ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు వివరించారు. అభయారణ్యంలో 3 కిలోమీటర్ల మేర ఉండే చెక్కల వంతెన సుమారు 80 శాతం మేర ధ్వంసమైంది. ఉప్పెనతో టిక్కెట్ కౌంటర్, బోటింగ్ వద్ద కంప్యూటర్లు, ఆఫీస్ రికార్డులు నీట మునిగి పాడైపోయాయి. ప్రత్యేక ఆకర్షణగా ఉండే అక్వేరియం, డాక్యుమెంటరీ థియేటర్, ఫర్నిచర్, ప్రొజెక్టర్ వంటివి సైతం తడిచిపోయాయి. కెరటాల ఉధృతికి ఫ్లోటింగ్ జెట్టీ లు, నేచర్ షాప్‌లో వస్తువులు పాడైపోవడంతో పాటు ప్రైవేటు ఫుడ్ కోర్టులకు సైతం నష్టం వాటిల్లింది. మొత్తంగా అభయారణ్యంలో సుమారు రూ.50 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు నష్టం జరిగిందని అంచనా వేశారు.
కష్టాల కడలిని దాటి..
క్షేమంగా ఇంటికి..
తాళ్లరేవు: వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా ఇంటికి చేరారు. తహసీల్దార్ జి.రామవీరభద్రరావు కథనం ప్రకారం.. చొల్లంగిపేటకు చెందిన మత్స్యకారులు నీలపల్లి గంగరాజు, నీలపల్లి ప్రసాద్, డొంకా రాజు ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున వేటకు వెళ్లారు. అప్పటికే అర్నబ్ తుపాను తీవ్రరూపం దాల్చడంతో ఈదురు గాలుల ధాటికి బోటు తిరగబడి సముద్రంలో గల్లంతయ్యారు. అక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్లి హోప్ ఐలాండ్ పొదల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ, ఆర్‌ట్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. పది బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి వారిని గుర్తించారు. స్థానిక నాయకులు, అధికారుల సమక్షంలో గురువారం చొల్లంగిపేటలోని ఇళ్లకు చేర్చారు. వీరిలో గంగరాజు, ప్రసాద్ తండ్రీకొడుకులు. మత్స్యకారులు సురక్షితంగా ఇంటికి తిరిగి రావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
● ముగ్గురు మత్స్యకారులు సురక్షితం
● స్వగ్రామానికి చేర్చిన అధికారులు


